దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీకర్ ఆసుపత్రి(RG Kar Incident)ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్(Sanjay Roy)ని కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. తాజాగా నిందితుడికి కోల్‌కతా సీల్దా కోర్టు అతడికి జీవితఖైదు విధించింది. విచారణ సందర్భంగా రేపిస్ట్ సంజయ్ రాయ్‌కి ఉరి శిక్ష విధించాలని కోర్టును సీబీఐ కోరింది. బాధితురాలు ఓ మెరిట్ స్టూడెంట్.. సమాజానికి ఆమె ఒక ఆస్తి అని వాదించింది. అత్యాచారం ఘటన సభ్యసమాజానికి దిగ్భ్రాంతిని కలిగించిందని పేర్కొంది. సీబీఐ వాదనలు విన్న కోర్టు.. నిందితుడికి జీవితఖైదును విధిస్తూ తీర్పును వెలువరించింది. తీర్పు వెల్లడయ్యే ముందు నిందితుడు సంజయ్ రాయ్ తాను ఏ తప్పు చేయలేదని వాపోయాడు. తనను కావాలనే ఓ ఐపీఎస్ అధికారి ఇరికించారని ఆరోపించాడు.
కాగా గతేడాది ఆగస్టు 9వ తేదీ ఉదయం ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ క్యాంపస్‌లోని సెమినార్ హాల్‌లో ట్రైనీ మహిళా డాక్టర్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసింది. ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్‌ను ఆగస్టు 10న కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేపట్టింది.