Indian Students in Russia: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థులు దోపిడీ, జాతి వివక్షకు గురవుతున్నారు. ఇది ప్రతి ఏటా పెరుగుతూనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 2025లో ప్రపంచవ్యాప్తంగా భారతీయుల నుంచి ఫిర్యాదులు అధికం కాగా.. ఒక్క రష్యా నుంచే 50శాతం కంటే ఎక్కువ ఫిర్యాదులు నమోదయ్యాయి. రష్యాలో భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి.. ఇక్కడ చూద్దాం.
విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల నుంచి నమోదవుతున్న దోపిడీ, జాతి వివక్ష ఫిర్యాదుల్లో రష్యా అగ్రస్థానంలో ఉందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) తెలిపింది. 2025లో ప్రపంచవ్యాప్తంగా భారతీయ విద్యార్థుల నుంచి దాదాపు 350 ఫిర్యాదులు అందగా.. వాటిలో 201 (57% కంటే ఎక్కువ) ఒక్క రష్యా నుంచే నమోదు కావడం అక్కడి విద్యార్థుల పరిస్థితిపై ఆందోళన కలిగిస్తోంది. ఇక రష్యాతో పాటు జార్జియా నుంచి 20 ఫిర్యాదులు, కిర్గిజిస్థాన్ నుంచి 14 ఫిర్యాదులు తర్వాతి స్థానాల్లో ఉన్నాయని పేర్కొంది.
2023లో రష్యాలో భారతీయుల నుంచి ఈ ఫిర్యాదుల సంఖ్య 66గా ఉండగా.. 2025 నాటికి 201కి చేరుకోవడం ఆందోళనకరం. రష్యాలో మన విద్యార్థులు ప్రధానంగా జాతి వివక్ష, వేధింపులు, విశ్వవిద్యాలయాల నుంచి మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదుల్లో ప్రస్తావించారు. చిన్న కారణాలకే బహిష్కరిస్తామని బెదిరించడం వంటి ఫిర్యాదులు కూడా నమోదయ్యాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇటీవల రష్యాలోని ఉఫా నగరంలో ఓ మెడికల్ యూనివర్సిటీ హాస్టల్‌లో ఇటీవల నలుగురు భారతీయ విద్యార్థులపై కత్తి దాడి జరిగిన విషయం తెలిసిందే. దీంతో తాజా నివేదికలు, ఘటనలు విద్యార్థులపై భద్రతా ఆందోళనలను మరింత తీవ్రం చేసింది. ఈ క్రమంలో విదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాల్లో విద్యార్థుల రక్షణ, భద్రత, శ్రేయస్సు కోసం ప్రత్యేక అధికారులను నియమించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. వాక్-ఇన్, ఇమెయిల్, బహుభాషా 24×7 అత్యవసర నంబర్లు, వాట్సాప్ నంబర్, MADAD/CPGRAMS/eMigrate వంటి ఫిర్యాదుల పరిష్కార పోర్టల్, సోషల్ మీడియా మొదలైన వాటి ద్వారా రాయబార కార్యాలయం/కాన్సులేట్‌ను సంప్రదించవచ్చని తెలిపింది.
కాగా, మెడిసిన్, ఇంజినీరింగ్ విద్య కోసం భారతీయ విద్యార్థులకు రష్యా చాలా కాలంగా అత్యంత ప్రాచుర్యం పొందిన గమ్యస్థానాలలో ఒకటిగా ఉంది. నివేదిక ప్రకారం 2024 నాటికి 31,000 కంటే ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు రష్యన్ విశ్వవిద్యాలయాలలో చేరారు.

