Lalu Prasad Yadav Eye Operation: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఢిల్లీలోని ఓ ప్రైవేట్ కంటి ఆస్పత్రిలో శుక్లాలు, రెటీనా శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని తెలిపాయి. సెంటర్ ఫర్ సైట్ గ్రూప్ ఆఫ్ ఐ హాస్పిటల్స్ ఛైర్మన్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ మహిపాల్ సింగ్ సచ్‌దేవ్ పర్యవేక్షణలో న్యూఢిల్లీలోని సెంటర్ ఫర్ సైట్‌లో ఈ శస్త్రచికిత్స జరిగింది.
‘లాలూ ప్రసాద్ యాదవ్‌కు ముందుగా ప్రణాళిక ప్రకారం కంటి శుక్లం, రెటీనాకు సంబంధించిన శస్త్రచికిత్స జరిగింది. అది విజయవంతంగా పూర్తయింది. ఆయన చికిత్సకు బాగా స్పందిస్తున్నారు. సాధారణ శస్త్రచికిత్స అనంతర సంరక్షణ, తదుపరి పరీక్షల తర్వాత ఆయన త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం.’ అని ఆసుపత్రి యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
Also Read: https://teluguprabha.net/telangana-news/harish-rao-comments-on-sarpanch-election-results/
అధునాతన నేత్ర వైద్య పద్ధతులను ఉపయోగించి ఎలాంటి సమస్యలు లేకుండా శస్త్రచికిత్స పూర్తి అయిందని, దీనిని డే-కేర్ విధానంలో నిర్వహించామని ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. ప్రస్తుతం ఆయన డిశ్చార్జ్ అయ్యారని, ఇంట్లోనే కోలుకుంటారని ప్రకటనలో పేర్కొంది. లూలూ ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమార్తె భారతి కూడా సోషల్ మీడియాలో అప్‌డేట్‌ను పంచుకున్నారు.
కాగా, 77 ఏళ్ల లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం దాణా కుంభకోణం కేసులలో బెయిల్‌పై ఉన్నారు. దోషిగా నిర్ధారణ కావడంతో, ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం విడుదలైన తర్వాత ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. అయినప్పటికీ, ఆయన RJD పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ బిహార్ రాజకీయాలలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. అంతేకాకుండా పార్టీ వ్యవహారాలను ప్రభావితం చేస్తున్నారు.

