Saturday, November 15, 2025
Homeనేషనల్Bihar Elections: 143 మంది అభ్యర్థులతో ఆర్జేడీ జాబితా విడుదల.. తేజస్వీ యాదవ్‌ పోటీ ఎక్కడినుంచంటే?

Bihar Elections: 143 మంది అభ్యర్థులతో ఆర్జేడీ జాబితా విడుదల.. తేజస్వీ యాదవ్‌ పోటీ ఎక్కడినుంచంటే?

RJD Releases List Of Candidates, Tejashwi Yadav Contest From Raghopur: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ దగ్గరపడుతోన్న కొద్ది సీట్ల కేటాయింపు జోరందుకుంటోంది. ఇప్పటికే తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన బీజేపీ, జేడీయూ కూటమి ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. అయితే, సీట్ల సర్దుబాటు విషయంలో సయోధ్య కుదరకపోవడంతో ‘మహాఘఠ్‌బంధన్‌’లో సీట్ల పంపకాలు మాత్రం పూర్తికాలేదు. దీనిపై కాంగ్రెస్‌, ఆర్జేడీ మధ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. తేజస్వీ యాదవ్‌ ఆధ్వర్యంలోని ఆర్జేడీ పార్టీ సోమవారం అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది. 143 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ ఆర్జేడీ సోమవారం తొలి జాబితాను విడుదల చేసింది. కాగా ఆర్జేడీ (ఆర్జేడీ) అగ్రనేత, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ వైశాలి జిల్లాలోని రాఘోపుర్‌ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు ఈ జాబితాలో వెల్లడించింది. బీహార్‌ ఎన్నికల రెండో విడతకు నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. దీంతో ఆర్జేడీ అధికారిక జాబితాను విడుదల చేయడం గమనార్హం. తొలి విడత పోలింగ్‌కు నామినేషన్ల గడువు అక్టోబరు 17నే ముగిసింది. నామనేషన్ల ఉపసంహరణకు సోమవారమే ఆఖరు తేదీ. అటు కాంగ్రెస్‌ కూడా ఇప్పటివరకు 60 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

- Advertisement -

సీట్ల సర్దుబాటులో కుదరని సయోధ్య..

కాగా, మహాఘఠ్‌బంధన్‌ కూటమిలో భాగస్వామి అయిన ఆర్జేడీకి, కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. కొన్ని స్థానాలను ఆర్జేడీ, కాంగ్రెస్‌ రెండు పార్టీలు అడుగుతుండటంతో సయోధ్య కుదరడం లేదు. ఈ విషయంలోనే తేజస్వి, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మధ్య దూరం పెరిగిందని పరిశీలకులు భావిస్తున్నారు. దీని వల్లే ఇప్పటివరకు మహాగఠ్‌బంధన్‌ సీట్ల పంపకాలపై ఎలాంటి ప్రకటన చేయలేదని తెలుస్తోంది. అంతేకాదు, తొలివిడత పోలింగ్‌ జరిగే 121 స్థానాల్లో 125 మంది అభ్యర్థులను విపక్ష కూటమి బరిలోకి దింపింది. నాలుగు స్థానాల్లో రెండు పార్టీలూ తమ అభ్యర్థులను ప్రకటించాయి. కూటమిలోని పార్టీల మధ్య సమన్వయ లోపానికి ఇదే నిదర్శనంగా కనిపిస్తోంది. బిహార్‌లో నవంబరు 6, 11వ తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 14న ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలను ప్రకటించనున్నారు. అయినా ఇంకా సీట్ల సర్దుబాటు పూర్తి కాలేదు.

నవంబర్‌ 14న ఫలితాలు..

ఇండి కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆర్జేడీ, సీపీఐ (ఎమ్ఎల్) ఎల్, సీపీఐ (ఎం), సీపీఐ, వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)లతో కలిసి కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తున్నాయి. తొలి దశలో మొత్తం 20 జిల్లాల్లోని 122 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ఇండి కూటమిలో సీట్ల పంపకాల విషయంలో సమస్యలున్న మాట వాస్తవమేనని కాంగ్రెస్ పార్టీ నేత సురేంద్ర రాజ్‌పుత్ వెల్లడించారు. ఈ సమస్యలను చర్చల ద్వారా తాము పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. అయితే, తొలి విడత ఎన్నికల నామినేషన్ ప్రక్రియ అక్టోబర్ 17వ తేదీతోనే ముగిసిన సంగతి తెలిసిందే. కాగా, 243 స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీకి రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు విడతల్లో ఈ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్ 14వ తేదీన వెలువడుతాయి. ఈ ఎన్నికల ద్వారా మరోసారి అధికారాన్ని నిలుపుకోవాలని ఎన్డీయే భావిస్తుంది. కానీ ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ఇండి కూటమి కృత నిశ్చయంతో ఉంది. మరి ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటరు పట్టం కడతాడనేది నవంబర్ 14న తెలియనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad