RJD’s Job Guarantee: బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Polls) షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో, ప్రతిపక్ష కూటమి అయిన ఇండియా కూటమి దూకుడు పెంచింది. ముఖ్యంగా, ఆర్జేడీ (RJD) నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ఎన్నికల బరిలో దిగుతూ ఓ సంచలన హామీని ప్రకటించారు: తమ కూటమి అధికారంలోకి వస్తే, బిహార్‌లోని ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
20 రోజుల్లో చట్టం, 20 నెలల్లో అమలు:
ఈ హామీని కేవలం మాటలకే పరిమితం చేయకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన 20 రోజుల్లోపే ఇందుకు సంబంధించిన ప్రతిపాదిత చట్టాన్ని తీసుకువస్తామని, 20 నెలల్లోనే దీనిని అమలు చేస్తామని తేజస్వీ యాదవ్ ప్రకటించారు. నిరుద్యోగం సమస్యను సమూలంగా పరిష్కరించేందుకు, కేవలం సామాజిక న్యాయమే కాకుండా, ఆర్థిక న్యాయాన్ని కూడా సాధిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
పాత హామీలే కొత్త అస్త్రాలు:
గత 20 ఏళ్లలో అధికారంలో ఉన్న ఎన్డీయే (NDA) యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోయిందని తేజస్వీ విమర్శించారు. అంతకుముందు సంకీర్ణ ప్రభుత్వంలో తాను ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కొద్దికాలంలోనే ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించానని గుర్తు చేశారు. ఐదేళ్ల సమయం దొరికి ఉంటే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చేవాడినో ఊహించుకోవచ్చని ఓటర్లకు పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను ‘కాపీక్యాట్’ అంటూ ఎద్దేవా చేసిన తేజస్వీ, ప్రభుత్వం ప్రస్తుతం చేపడుతున్న అనేక కార్యక్రమాలు గత ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలనే పోలి ఉన్నాయని ఆరోపించారు. తాజా హామీతో తేజస్వీ నిరుద్యోగ యువత ఓట్లను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఎన్నికలు ప్రధానంగా ఉపాధి, అభివృద్ధి అంశాల చుట్టూ తిరిగే అవకాశం కనిపిస్తోంది.


