Rohini Acharya quits politics : బిహార్ ఎన్నికల్లో ఘోర పరాజయం రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో పెను ప్రకంపనలు సృష్టించింది. ఓటమి షాక్ నుంచి తేరుకోకముందే, ఆయన కుమార్తె రోహిణి ఆచార్య చేసిన ఒకే ఒక్క ట్వీట్ పార్టీలోనూ, కుటుంబంలోనూ చిచ్చు రేపింది. తాను రాజకీయాల నుంచే కాదు, ఏకంగా కుటుంబం నుంచే వైదొలగుతున్నానంటూ ఆమె చేసిన సంచలన ప్రకటన ఇప్పుడు బిహార్ రాజకీయాల్లో పెను తుఫానుగా మారింది. అసలు ఎన్నికల ఓటమికి, ఆమె నిర్ణయానికి సంబంధం ఏమిటి? ఆమె వేలెత్తి చూపుతున్న ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? లాలూ కుటుంబంలో రాజుకున్న ఈ అంతర్గత కలహాల వెనుక అసలు కథేంటి?
ఓటమి వేళ.. సంచలన ప్రకటన : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ నేతృత్వంలోని విపక్ష కూటమి చిత్తుగా ఓడిపోయిన మరుసటి రోజే (శనివారం), సింగపూర్‌లో నివసిస్తున్న రోహిణి ఆచార్య ‘ఎక్స్’ వేదికగా ఈ బాంబు పేల్చారు. “నేను రాజకీయాలను వదిలేస్తున్నాను, నా కుటుంబాన్ని కూడా వదులుకుంటున్నాను… సంజయ్ యాదవ్, రమీజ్‌లు నన్ను ఇదే చేయమన్నారు… నిందలన్నీ నేనే తీసుకుంటున్నాను,” అంటూ ఆమె చేసిన పోస్ట్ తీవ్ర కలకలం రేపింది. ఈ నిగూఢమైన ప్రకటన వెనుక పార్టీలో నెలకొన్న తీవ్రమైన అంతర్గత విభేదాలు ఉన్నాయని స్పష్టమవుతోంది.
విభేదాలకు ఆజ్యం పోసిన సంజయ్ యాదవ్ : రోహిణి తన పోస్టులో ప్రస్తావించిన సంజయ్ యాదవ్, ఆర్జేడీకి చెందిన రాజ్యసభ ఎంపీ. ఆయన తేజస్వి యాదవ్‌కు అత్యంత సన్నిహితుడిగా, రాజకీయ సలహాదారుడిగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు ముందు నుంచే పార్టీలో సంజయ్ యాదవ్ ప్రాబల్యం పెరగడం పట్ల, తేజస్వికి ఆయన అత్యంత సన్నిహితంగా మెలగడం పట్ల రోహిణి ఆచార్య పలుమార్లు తన అసంతృప్తిని, నిరాశను బహిరంగంగానే వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయాల్లో సంజయ్ యాదవ్ జోక్యం పెరిగిపోయిందని, కుటుంబ సభ్యుల కంటే ఆయనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె వర్గం ఆరోపిస్తోంది.
ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా రావడంతో, ఈ అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఓటమికి బాధ్యులుగా కొందరిని లక్ష్యంగా చేసుకుని రోహిణి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇది కేవలం ఓటమిపై అసహనంతో తీసుకున్న నిర్ణయమా లేక పార్టీలో, కుటుంబంలో తన సోదరుడు తేజస్విపై పెరుగుతున్న బయటి వ్యక్తుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ పరిణామం రానున్న రోజుల్లో ఆర్జేడీలో, లాలూ కుటుంబంలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

