Tamil Nadu : రోడ్డు మీద మనం ఎంత జాగ్రత్తగా వెలుతున్నా సరే ఎదుటి వారు కూడా అలాగే ఉంటారు అనుకుంటే పొరబాటే. ఒక్కొక్కసారి ఎదుటి వారి నిర్లక్ష్యం కారణంగా మనం ప్రమాదాల బారిన పడుతుంటాం. ఇలాగే ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ బైకర్ ప్రమాదానికి గురైయ్యాడు. ఆ బైకర్ అదృష్టం బాగా ఉందని అనుకుంటా. స్వల్ప గాయాలతోనే బయటపడ్డాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తూత్తుకుడి జిల్లా శ్రీవైకుంటం పట్టణానికి చెందిన ముత్తు ద్విచక్రవాహనంపై వెలుతున్నాడు. ఏరల్ ప్రాంతం వద్ద ఎదురుగా లారీ వచ్చింది. ఆ లారీ ట్రక్కుకు వేలాడుతున్న తాడు ముత్తు మెడకు చుట్టుకుంది. దీంతో అతడు అమాంతం గాల్లో ఎగిరి రోడ్డుపై పడ్డాడు. అదే సమయంలో ట్రక్కు నుంచి తాడు తెగిపడింది.
దీంతో ముత్తు కాసేపు స్పృహ కోల్పోయాడు. వెంటనే స్థానికులు అతడికి సాయం చేశారు. తనకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ముత్తుకు రెండు నిమిషాలకు పైగా సమయం పట్టింది. అయితే.. తాను ఎలా కింద పడ్డానో అనే విషయం మాత్రం అతడికి అర్థం కాలేదు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాల పుటేజ్‌లను పరిశీలించగా అసలు విషయం అర్థమైంది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం తెలుసుకున్నాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.