Roshni Nadar Richest Women in the country: భారతదేశంలోనే అత్యంత సంపన్నురాలైన మహిళగా హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఛైర్‌పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా నిలిచారు. తాజాగా, విడుదలైన M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం, ఆమె కుటుంబ సంపద రూ. 2.84 లక్షల కోట్లుగా నమోదైంది. దీంతో, దేశంలోని మొత్తం సంపన్నుల జాబితాలో మూడవ స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించారు. హురున్ జాబితాలో తొలి మూడు స్థానాల్లో ఒక మహిళ నిలవడం ఇది మొదటిసారి కావడం విశేషం. ఈ అరుదైన ఘనతను సాధించిన రోష్ని నాడార్, దేశ ఆర్థిక రంగంలో మహిళా నాయకత్వం పెరుగుతున్న ప్రభావాన్ని చాటిచెప్పారు. రూ. 2.84 లక్షల కోట్లు నికర సంపదతో రోష్ని నాడార్ దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా నిలవగా, మొత్తం జాబితాలో ముకేశ్ అంబానీ (రూ. 9.55 లక్షల కోట్లు), గౌతమ్ అదానీ (రూ. 8.15 లక్షల కోట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. రోష్ని నాడార్‌కు కేవలం 44 ఏళ్లే. ఆమె ఈ జాబితాలోని టాప్ 10 కుబేరులలో అతి పిన్న వయస్కురాలు కావడం విశేషం. హెచ్సీఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ కుమార్తె అయిన రోష్ని, 2020లో కంపెనీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. లిస్టెడ్ ఐటీ కంపెనీకి నాయకత్వం వహించిన మొదటి భారతీయ మహిళగా ఆమె గుర్తింపు పొందారు. కేవలం వ్యాపారంలోనే కాక, శివ్ నాడార్ ఫౌండేషన్ ద్వారా విద్య, దాతృత్వ కార్యక్రమాలలో కూడా ఆమె చురుకుగా పాల్గొంటున్నారు. ఆమె సాధించిన ఈ మైలురాయి, భారతదేశంలో టెక్నాలజీ ఆధారిత సంపద సృష్టి, మహిళల వ్యాపార విజయాలకు నిదర్శనంగా నిలుస్తుంది.
హెచ్సీఎల్ను విస్తరించడంలో కీలక పాత్ర..
హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్, కిరణ్ నాడార్ కూతురు రోష్ని 1982లో జన్మించారు. న్యూఢిల్లీలోని వసంత్ వ్యాలీ స్కూల్‌లో ప్రాథమిక విద్యనభ్యసించారు. అనంతరం ఉన్నత విద్యను అభ్యసించడానికి అమెరికాకు వెళ్లిన ఆమె నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీలో కమ్యూనికేషన్స్ విభాగంలో డిగ్రీ పట్టా పొందారు. అదే యూనివర్సిటీ పరిధిలోని కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. రోష్ని మల్హోత్ర ప్రస్తుతం పలు ప్రతిష్టాత్మక గ్లోబల్ అడ్వైజరీ బోర్డుల్లో సభ్యురాలిగానూ కొనసాగుతున్నారు. ఇందులో MIT స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్‌కు సంబంధించిన డీన్స్ అడ్వైజరీ కౌన్సిల్, అమెరికా-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరమ్ (USISPF), ది నేచర్ కన్జర్వన్సీ (TNC)లోనూ సభ్యులుగా కొనసాగుతున్నారు. హెచ్‌సీఎల్‌ను ప్రపంచ వ్యాప్తంగా మరింత విస్తరించి, అగ్రగామి కంపెనీగా నిలబెట్టడంలో మల్హోత్రా పాత్ర అనిర్వచనీయం. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో కూడా రోష్నీ తరచుగా ర్యాంక్ దక్కించుకోవడం విశేషం.


