RSS Chief Mohan Bhagwat remarks : “వయసు 75 ఏళ్లు దాటింది.. ఇక విశ్రాంతి తీసుకుంటారా?” అనే ప్రశ్నకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) అధినేత మోహన్ భాగవత్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. పదవి ముఖ్యం కాదు, బాధ్యతే పరమావధి అని తేల్చిచెప్పారు. ముంబయి వేదికగా జరుగుతున్న సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కేవలం రిటైర్మెంట్ గురించేనా? బంగ్లాదేశ్ హిందువుల భద్రత, దేశంలో మారుతున్న జనాభా తీరుతెన్నులు, వీర సావర్కర్‌కు భారతరత్న.. ఇలా ఎన్నో కీలక అంశాలపై ఆయన స్పందించారు. ఇంతకీ సంఘ్ చీఫ్ మనసులో ఏముంది? ఆయన వారసుడి ఎంపిక ఎలా జరుగుతుంది?
“ఆదేశమే శిరోధార్యం.. పనికి విరామం లేదు” : ముంబయిలో నిర్వహించిన ‘సంఘ్ ప్రస్థానానికి వందేళ్లు-నూతన దిగంతాలు’ కార్యక్రమంలో మోహన్ భాగవత్ ప్రసంగిస్తూ తన పదవీ విరమణపై స్పష్టత ఇచ్చారు. తనకు 75 ఏళ్లు నిండాయని, ఈ విషయాన్ని ఆర్‌ఎస్‌ఎస్ పెద్దల దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. అయితే, సంస్థ తనను బాధ్యతల్లో కొనసాగమని కోరినట్లు వెల్లడించారు.
“సంఘ్ ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు పదవి నుంచి వైదొలుగుతాను. కానీ స్వయం సేవక్‌గా నా పనికి మాత్రం రిటైర్మెంట్ ఉండదు” అని స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ పదవికి ఎన్నికలు ఉండవని, రీజినల్, డివిజనల్ అధిపతులే తదుపరి ‘సర్సంఘ్చాలక్’ను ఎన్నుకుంటారని తెలిపారు. ఈ అత్యున్నత పదవికి కులంతో సంబంధం లేకుండా, సంస్థకు అంకితమైన ఉత్తమ హిందువునే ఎంపిక చేస్తారని క్లారిటీ ఇచ్చారు.
బంగ్లా హిందువుల పోరాటానికి అండగా : పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో మైనారిటీల పరిస్థితిపై భాగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ దాదాపు కోటిన్నర మంది హిందువులు ఉన్నారని గుర్తుచేశారు. “వారు తమ హక్కుల కోసం అక్కడే ఉండి పోరాటం చేయాలనుకుంటే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ వారికి అండగా నిలుస్తారు” అని భరోసా ఇచ్చారు.
జనాభా అసమతుల్యత – చొరబాట్లపై ఆందోళన : దేశంలో జనాభా కూర్పు మారుతోందన్న అంశంపై గత ప్రభుత్వాల తీరును భాగవత్ తప్పుబట్టారు. జననాల రేటులో వ్యత్యాసం, అక్రమ వలసలే జనాభా మార్పులకు ప్రధాన కారణమని విశ్లేషించారు. ప్రస్తుత ప్రభుత్వం చొరబాట్లను అరికట్టే దిశగా అడుగులు వేస్తోందని కితాబునిచ్చారు. “విదేశీయులను భాష ద్వారా, ఇతర ఆధారాల ద్వారా గుర్తించాలి. రాబోయే జనగణన, ఎస్‌ఐఆర్‌లో చొరబాటుదారులు దొరికిపోతారు. విదేశీయులకు మన దేశంలో ఉద్యోగాలు ఇవ్వకూడదు. అదే సమయంలో మన దేశ పౌరుడైన ముస్లింకు, విదేశీ ముస్లింకు తేడా గమనించాలి. భారతీయ ముస్లింలకు మన దేశం అండగా ఉంటుంది” అని వ్యాఖ్యానించారు.
సావర్కర్‌కు ‘భారతరత్న’ దక్కాలి : స్వాతంత్ర్య సమరయోధుడు వీర సావర్కర్‌కు అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ఇస్తే.. ఆ అవార్డుకే వన్నె వస్తుందని భాగవత్ అభిప్రాయపడ్డారు. అలాగే, అమెరికాతో వాణిజ్య ఒప్పందాల విషయంలో భారత్ నష్టపోకుండా జాగ్రత్తపడాలని, ఉమ్మడి పౌరస్మృతి (UCC)ని అందరినీ కలుపుకుపోతూ రూపొందించాలని సూచించారు.

