RSS role in Bihar elections : బిహార్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగకముందే తెర వెనుక రాజకీయ చదరంగం మొదలైంది. కమలదళానికి పరోక్షంగా బలాన్నిచ్చేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ‘ఆపరేషన్ త్రిశూల్’ అనే సంకేత నామంతో ఓటర్లను ప్రభావితం చేసేందుకు భారీ ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. అసలు ఈ ‘ఆపరేషన్ త్రిశూల్’ అంటే ఏమిటి? పార్టీలకు అతీతం అని చెప్పుకునే సంఘ్, బీజేపీ కోసం ఎందుకు పనిచేస్తుంది? ఈ నిశ్శబ్ద వ్యూహం ఎన్నికల ఫలితాలను ఏ మేరకు మార్చగలదు?
ఎన్నికలంటే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు కేవలం రాజకీయ క్రీడ కాదు, అదొక దేశ నిర్మాణ ప్రక్రియ. ఈ సిద్ధాంతంతోనే ప్రతి ఎన్నికల్లోనూ తమ భావజాలానికి దగ్గరగా ఉండే భారతీయ జనతా పార్టీకి అనుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు సంఘ్ పరివార్ అవిశ్రాంతంగా పనిచేస్తుంది. త్వరలో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ‘ఆపరేషన్ త్రిశూల్’ పేరుతో క్షేత్రస్థాయిలో కార్యకలాపాలను ముమ్మరం చేయడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సంఘ్ వాలంటీర్లు ప్రతి బూత్‌లోనూ చురుగ్గా పనిచేయనున్నారు. బీజేపీ ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తిగా ఉన్న ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం నుంచి, జాతీయవాదం, హిందూత్వ భావజాలాలకు ఆకర్షితులయ్యే కొత్త ఓటర్లను గుర్తించడం వరకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.
‘ఆపరేషన్ త్రిశూల్’ – మూడు ముఖాల వ్యూహం : సంఘ్ పరిభాషలో ‘ఆపరేషన్ త్రిశూల్’కు మూడు ప్రధాన అర్థాలు ఉన్నాయి.
గడపగడపకు సిద్ధాంతం: ప్రతి ఇంటికీ చేరుకుని, సంఘ్ భావజాలాన్ని వివరిస్తూ, దేశ హితం దృష్ట్యా బీజేపీకి ఓటు వేసేలా ఓటర్లను ప్రేరేపించడం.
బూత్ స్థాయిలో బలం: ప్రతి పోలింగ్ బూత్‌లోనూ ఓటర్లు గరిష్ఠ సంఖ్యలో పాల్గొనేలా చూడటం. ముఖ్యంగా సంఘ్‌కు, బీజేపీకి బలహీనంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించడం.
సమన్వయ వారధి: క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సంఘ్ వాలంటీర్లకు, బీజేపీ స్థానిక నాయకులకు మధ్య సమన్వయం కుదర్చడం.
మేము బీజేపీ కోసం పనిచేయం: అయితే, తాము ఏ రాజకీయ పార్టీ కోసం పనిచేయమని సంఘ్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. “ఆర్ఎస్ఎస్ ఎన్నడూ బీజేపీ కోసం ప్రచారం చేయదు, ఓట్లు అడగమని తమ వాలంటీర్లకు చెప్పదు. ఇది మా సైద్ధాంతిక యుద్ధం. సంఘ్ కార్యకర్తలు సమాజంలో జాతీయవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తారు. దేశం కోసం పనిచేస్తున్న ఉత్తమ అభ్యర్థులకు ఓటు వేయమని ప్రజలను చైతన్యపరుస్తారు,” అని పాంచజన్య సీనియర్ జర్నలిస్ట్ సంజీవ్ కుమార్ తెలిపారు.
అసంతృప్తులను బుజ్జగించడంలో కీలక పాత్ర: క్షేత్రస్థాయిలో సంఘ్ పాత్ర కేవలం ఓటర్లను ప్రభావితం చేయడమే కాదని, బీజేపీ అంతర్గత సమస్యలను పరిష్కరించడంలో కూడా కీలకమని విశ్లేషకులు చెబుతున్నారు. “ఎన్నికల్లో టికెట్ దక్కని అసంతృప్త నేతలు రెబెల్స్‌గా మారి పార్టీకి నష్టం కలిగించకుండా చూడటంలో ఆర్ఎస్ఎస్ పెద్దన్న పాత్ర పోషిస్తుంది. అలాంటి నేతలకు ఉన్న ఓటు బ్యాంకు చీలిపోకుండా… వారిని బుజ్జగించి, పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేసేలా ఒప్పించే పెద్ద బాధ్యతను సంఘ్ తీసుకుంటుంది,” అని ప్రముఖ జర్నలిస్ట్ ప్రవీణ్ బాగి అభిప్రాయపడ్డారు.
సంఘ్ అనుబంధ సంస్థలైన ఏబీవీపీ, బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్, మజ్దూర్ సంఘ్ లాంటివి కూడా ఈ ఎన్నికల వ్యూహంలో భాగమవుతాయి. విద్యార్థులు, యువకులు, కార్మికులు వంటి నిర్దిష్ట ఓటరు సమూహాలను ఆకట్టుకోవడానికి ఈ సంస్థలు పనిచేస్తాయి. పోలింగ్ రోజున తమ మద్దతుదారులంతా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటం, వారిని బూత్‌ల వద్దకు తరలించడం వంటి బాధ్యతలను సంఘ్ కార్యకర్తలు తీసుకుంటారు. అయితే, ఎన్నికల్లో గెలిచిన తర్వాత నేతలు తమను పట్టించుకోరని కొందరు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.
మొత్తం మీద, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం, ఓటింగ్ శాతాన్ని పెంచడం, జాతీయ భావాన్ని పెంపొందించడమే తమ లక్ష్యమని ఆర్‌ఎస్‌ఎస్ బిహార్-ఝార్ఖండ్ ప్రచార చీఫ్ రాజేశ్ పాండే చెబుతున్నప్పటికీ, ఈ నిశ్శబ్ద కార్యకలాపాల వల్ల అంతిమంగా రాజకీయ లబ్ధి పొందేది బీజేపీయేనన్నది కాదనలేని వాస్తవం.


