Karnataka CM Siddaramaiah: సిద్ధరామయ్యకు షాకిచ్చిన హైకమాండ్.. త్వరలోనే సీఎం మార్పు?
Rumor regarding potential change of Chief Minister in Karnataka: కర్ణాటకలో సీఎం మార్పుపై గత కొంతకాలంగా జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నవంబర్ చివరి నాటికి ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో సీఎం మార్పు అంశం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా సీఎం సిద్ధరామయ్యకు కాంగ్రెస్ హైకమాండ్ బిగ్ షాకిచ్చింది. నవంబర్ 15న ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లనున్నారు.ఈ క్రమంలోనే అక్కడ సీనియర్ నేతలను కలిసిందుకు అనుమతి కోరగా.. హైకమాండ్ నిరాకరించినట్లు తెలుస్తోంది. సీనియర్ నేతలతో భేటీ అవసరం లేదని ఆయనకు చెప్పినట్లు సంబంధిత వర్గాల సమాచారం.మరోవైపు సిద్ధరామయ్య వర్గంలో ఉన్న ఎమ్మెల్యే రాఘవేంద్ర హిట్నాల్.. ఎమ్మెల్యేలు, మంత్రులకు ఢిల్లీలో విందు ఏర్పాటు చేశారు. సీఎం సిద్ధరామయ్య సోదరుడు కొప్పల్ ఎంపీ రాజశేఖర్ హిట్నాల్ నివాసంలో జరిగిన ఈ భేటీ బల ప్రదర్శన కోసమే ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. వారం రోజుల్లోనే ఆయన ఢిల్లీ వెళ్లడం ఇది రెండోసారి. అయితే, ఓట్ చోరీ విషయంలో ఆయన ఢిల్లీలో పర్యటిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీలో సీఎం మార్పుపై పరిణామాలు వేగంగా కదులుతుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఏ క్షణంలోనైనా సీఎం మార్పు ఉండబోతోందని సమాచారం.
బీహార్ ఎన్నికల తర్వాత సీఎం మార్పు?
కర్ణాటకలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా సీఎం ఎంపికలో ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. డీకే శివకుమార్, సిద్ధరామయ్య మధ్య దోబూచులాడిన సీఎం పదవి ఎట్టకేలకు సిద్ధరామయ్యను వరించింది. సీనియార్టీని పరిగణలోకి తీసుకున్న హైకమాండ్ సిద్ధరామయ్యకు సీఎం బాధ్యతలు అప్పగించింది. ఆ సమయంలోనే రెండున్నరేళ్ల తర్వాత సీఎం మార్పు ఉంటుందనే ప్రచారం నడిచింది. ఇటీవల ఓ ఎమ్మెల్యే మరికొన్ని రోజుల్లో డీకే శివకుమార్ సీఎం అవుతారని చెప్పడం రాజకీయంగా దుమారం రేపింది. అప్పటి నుంచి కర్ణాటకలో సీఎం మార్పు అంశం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే సిద్ధరామయ్య కూడా తానే ఐదేళ్లు సీఎంగా ఉంటానని తేల్చిచెప్పారు. ఇటీవల ఇదే విషయంపై మీడియా ఆయన్ను కొన్ని ప్రశ్నలు అడగ్గా.. నాయకత్వ మార్పు గురించి కాంగ్రెస్ హై కమాండ్ ఏమైనా చెప్పిందా అని ఎదురు ప్రశ్నలు వేశారు. ఈ విషయంపై ప్రజలు ఎప్పుడూ ఏదోఒకటి చెబుతారని.. వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇందులో ప్రజల కంటే ఎక్కువగా మీడియా ఆసక్తి కనబరుస్తోందన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలైన మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ విషయంపై ఏమైనా చెప్పినప్పుడే దాని గురించి ప్రశ్నించాలని సూచించారు. అయితే, బిహార్ ఎన్నికల తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీలతో చర్చించనున్నట్లు సిద్ధరామయ్య తెలిపారు. మరే విషయం గురించీ తనకు తెలియదన్నారు. అయితే, బీహార్ ఎన్నికల తర్వాత సీఎం మార్పు గురించి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ విడివిడిగా కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చలు జరపనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.


