ED probe in Sabarimala gold theft : అయ్యప్ప సన్నిధిలో జరిగిన స్వర్ణాభరణాల చోరీ కేసు సంచలన మలుపు తిరిగింది. ఇప్పటికే రాష్ట్ర పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ చేస్తుండగా, ఇప్పుడు ఏకంగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. మనీలాండరింగ్ కోణంలో కేసు నమోదు చేయడంతో, ఈ వ్యవహారం వెనుక ఉన్న ఆర్థిక మూలాలు, తెరవెనుక ఉన్న ‘పెద్ద తలకాయలు’ ఎవరనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసలు ఈడీ ఎందుకొచ్చింది? దీనివల్ల కేసు గతి మారుతుందా?
శబరిమల ఆలయంలో బంగారం దొంగతనం జరిగిన కేసులో, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొచ్చి యూనిట్, మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) నమోదు చేసింది. దీనితో ఈ కేసు దర్యాప్తు కేంద్ర దర్యాప్తు సంస్థ పరిధిలోకి వెళ్లినట్లయింది.
దర్యాప్తు వలయంలోకి మరికొందరు : ఈ కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసిన రాష్ట్ర సిట్ దర్యాప్తు, కేరళ హైకోర్టు పర్యవేక్షణలో కొనసాగుతోంది. ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగడంతో, దర్యాప్తు పరిధి మరింత విస్తృతం కానుంది. సిట్ కేసులో నిందితులుగా ఉన్న వారందరినీ ఈడీ కూడా తమ కేసులో చేర్చే అవకాశం ఉందని, దర్యాప్తులో మరిన్ని కొత్త పేర్లు, రాజకీయ ప్రముఖులు బయటకు రావచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
ఈడీ ఎందుకు వచ్చింది.. మనీలాండరింగ్ కోణం : రాష్ట్ర పోలీసుల దర్యాప్తు చోరీ జరిగిన తీరుపై దృష్టి సారిస్తే, ఈడీ దర్యాప్తు మాత్రం పూర్తిగా ఆర్థిక కోణంలో ఉండనుంది. చోరీ చేసిన బంగారం ద్వారా వచ్చిన నల్లధనాన్ని ఎలా, ఎక్కడికి తరలించారు..? ఈ నేరపూరిత డబ్బును ఎవరు వినియోగించుకున్నారు..? ఈ వ్యవహారంలో హవాలా లావాదేవీలు ఏమైనా జరిగాయా..? అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేయనుంది.
ఈ కేసు ఇప్పటికే రాజకీయంగా సున్నితంగా మారిన నేపథ్యంలో, కేంద్ర దర్యాప్తు సంస్థ జోక్యం చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సిట్ దర్యాప్తుతో పాటు, ఈడీ విచారణ కూడా సమాంతరంగా సాగనుండటంతో, శబరిమల స్వర్ణచోరీ కేసులో మున్ముందు మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

