Sabarimala gold theft investigation : అయ్యప్ప స్వామి సన్నిధిలో జరిగిన స్వర్ణాభరణాల మాయం కేసు కీలక మలుపు తిరిగింది. దశాబ్దాలుగా పూజలు అందుకుంటున్న ప్రధాన తంత్రికే (ప్రధాన పూజారి) కందరారు రాజీవరు చుట్టూ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఉచ్చు బిగిస్తోంది. ఈ కేసులోని ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టితో ఆయనకున్న దశాబ్దాల నాటి అనుబంధంపై సిట్ దృష్టి సారించడంతో, తంత్రినే స్వయంగా విచారణకు పిలిపించారు. అసలు ఈ కేసులో తంత్రి పాత్ర ఎంత? ప్రధాన నిందితుడికి, ఆలయ పూజారుల కుటుంబానికి ఉన్న సంబంధమేంటి?
శబరిమల అయ్యప్ప స్వామికి చెందిన బంగారు పూత పూసిన పవిత్ర వస్తువులు మాయమైన కేసులో, హైకోర్టు నియమించిన సిట్, విచారణను ముమ్మరం చేసింది. శుక్రవారం, ప్రధాన తంత్రి కందరారు రాజీవరును సిట్ అధికారులు తిరువనంతపురంలోని ఓ “రహస్య ప్రదేశం”లో విచారించారు. అనంతరం, కేరళ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉందని, అవినీతి నిరోధక చట్టం కిందకు తంత్రి వస్తారా లేదా అనే దానిపై సిట్ న్యాయ సలహా తీసుకుంటోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
విచారణలో కీలకం.. ఆ ‘దశాబ్దాల నాటి అనుబంధం’ : ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టితో, తంత్రికి ఉన్న సంబంధాలపైనే సిట్ ప్రధానంగా దృష్టి సారించింది. 2000వ దశకం ప్రారంభంలో, శబరిమలలో ఓ చిన్న పూజారికి సహాయకుడిగా పనిచేసిన పొట్టి, అనతికాలంలోనే ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు (TDB) పెద్దలతో, ఆలయ పూజారులతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు. సంపన్న అయ్యప్ప భక్తులతో ఓ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి, ఆలయానికి భారీగా విరాళాలు, ఖరీదైన పూజలకు స్పాన్సర్‌షిప్‌లు ఇప్పించేవాడు. దీంతో, బోర్డు అధికారులకు, పూజారులకు పొట్టి అత్యంత కీలక వ్యక్తిగా మారాడు. సినీ తారలు, ప్రముఖులకు ప్రత్యేక దర్శనాలు, పూజలు ఏర్పాటు చేయడంలో పొట్టిదే కీలక పాత్ర అని సిట్ తన నివేదికలలో పేర్కొంది.
సిట్ వద్ద పక్కా ఆధారాలు : ప్రధాన నిందితుడు పొట్టికి, తంత్రి కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యాన్ని నిరూపించే ఫోటోలను సిట్ సేకరించినట్లు సమాచారం. సంపన్నుల ఇళ్లలో ప్రైవేట్‌గా పూజలు నిర్వహించడానికి, పొట్టి ఆ పూజారుల కుటుంబంతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కూడా ఆధారాలున్నాయని తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు మాజీ TDB అధ్యక్షులతో సహా 11 మందిని సిట్ అరెస్ట్ చేసింది. ఇప్పుడు, ఏకంగా ప్రధాన తంత్రినే విచారిస్తుండటంతో, ఈ స్వర్ణాల మాయం కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

