Sabarimala Makara Jyothi Darshan: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో మకరజ్యోతి దర్శనం కనువిందు చేసంది. అశేష భక్తజన సందోహం మధ్య అయ్యప్ప భక్తులు ప్రత్యక్షంగా మకర జ్యోతి దర్శనం చేసుకున్నారు. సరిగ్గా నేటి (బుధవారం) సాయంత్రం 6:30 గంటలకు పొన్నాంబలమేడు కొండపై మకరజ్యోతి మూడుసార్లు భక్తులకు దర్శనమిచ్చింది. ఈ అపురూప దృశ్యాన్ని తిలకించిన లక్షలాది మంది భక్తజనం “స్వామియే శరణం అయ్యప్ప” అంటూ అయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు మార్మోగిపోయాయి. అంతకుముందు, పందళం రాజప్రాసాదం నుంచి తీసుకొచ్చిన పవిత్రమైన తిరువాభరణాలను అయ్యప్ప స్వామికి పూజారులు అలంకరించారు. అనంతరం, ఆలయ పూజారులు స్వామివారికి ప్రత్యేక దీపారాధన నిర్వహించారు. ఆ వెంటనే పొన్నాంబలమేడు కొండపై దివ్యజ్యోతి కనిపించడంతో శబరిగిరులు అయ్యప్ప నామ స్మరణతో మార్మోగిపోయాయి. అయ్యప్ప భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. మకరజ్యోతిని సాక్షాత్తు అయ్యప్ప స్వామి జ్యోతిర్మయ రూపంగా భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ జ్యోతిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోయి, కోరిన కోరికలు నెరవేరతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. మకరజ్యోతి దర్శనం సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. భక్తుల రద్దీని నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకున్కనారు. కొండపైకి పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించారు. ఆన్‌లైన్ టోకెన్లు ఉన్న వారినే అనుమతించారు. శబరిమల క్షేత్రానికి రాలేని భక్తుల కోసం పలు టీవీ ఛానెళ్లు, యూట్యూబ్ ఛానెళ్లు మకర జ్యోతి దర్శనాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఏటా మకర సంక్రాంతి నాడు జరిగే ఈ వేడుక కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు 41 రోజుల పాటు అయ్యప్ప దీక్షతో శబరిమలకు చేరుకుంటారు.
Makara Jyoti witnessed at Sabarimala
Swamiye Sharanam Ayyappa 🙏 pic.twitter.com/MLjHd2trgu
— Anu Satheesh 🇮🇳🚩 (@AnuSatheesh5) January 14, 2026

