ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. కరోనా వ్యాప్తి కారణంగా.. రెండేళ్లుగా పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతిచ్చిన ట్రావెన్ కోర్ బోర్డు.. ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పట్టడంతో పరిమితిని ఎత్తివేసింది. దాంతో అయ్యప్పమాలలు ధరించిన భక్తులు భారీగా శబరిమలకు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో 10రోజుల్లోనే ఆలయానికి రికార్డుస్థాయిలో ఆదాయం వచ్చింది.
గతేడాది నవంబర్ లో రూ. 9.92 కోట్ల ఆదాయమే వచ్చిందని ట్రావెన్ కోర్ బోర్డు దేవస్థానం అధ్యక్షుడు అనంతగోపన్ తెలిపారు. ఈ ఏడాదిలో గడిచిన పదిరోజుల్లోనే రూ.52కోట్లు ఆదాయం సమకూరిందని ఆయన పేర్కొన్నారు. స్వామివారి ప్రసాదాలు అప్పం విక్రయాల ద్వారా రూ. 2.58 కోట్లు ఆదాయం, అరవణ విక్రయం ద్వారా రూ. 23.57 కోట్లు, దేవస్థానం హుండీ ద్వారా సుమారుగా రూ. 12.73 కోట్లు ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు. భక్తుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉత్సవాల నిర్వహణ కోసమే ఖర్చు చేస్తున్నట్లు అనంతగోపన్ వెల్లడించారు. శబరిమలకు వచ్చే భక్తులు ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా దర్శనం టికెట్లను పొందవచ్చనని తెలిపారు.