Sabarimala women’s entry debate : శబరిమల అయ్యప్ప ఆలయంలో మహిళల ప్రవేశంపై ఏళ్ల తరబడి సాగుతున్న వివాదం మరో కీలక మలుపు తిరిగింది. ఒకప్పుడు సుప్రీంకోర్టు తీర్పును సమర్థించిన కేరళ ప్రభుత్వ నియంత్రణలోని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) ఇప్పుడు అనూహ్యంగా వెనక్కి తగ్గుతోంది. ఆలయ ఆచారాలు, సంప్రదాయాల పరిరక్షణే తమ ధ్యేయమని స్పష్టం చేస్తూ, సుప్రీంకోర్టులో కొత్త అఫిడవిట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది. అసలు ఈ మార్పునకు కారణమేంటి..? దీని వెనుక రాజకీయ వ్యూహం ఏమైనా ఉందా..?
కొత్త అఫిడవిట్‌కు సన్నాహాలు : శబరిమల ఆచారాలను కాపాడతామని, ఈ విషయంలో సుప్రీంకోర్టును ఒప్పిస్తామని టీడీబీ కొత్త అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తాజాగా ప్రకటించారు. “మహిళల ప్రవేశానికి సంబంధించిన పిటిషన్‌పై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఆ తర్వాత ఆచారాల ప్రాముఖ్యతను వివరిస్తూ అత్యున్నత న్యాయస్థానంలో కొత్త అఫిడవిట్ సమర్పించాలని బోర్డు యోచిస్తోంది” అని ఆయన వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు కేరళలో తీవ్ర చర్చకు దారితీశాయి.
రాజకీయ కోణమేనా : ఈ వైఖరి మార్పు వెనుక బలమైన రాజకీయ, సామాజిక కారణాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో అత్యంత ప్రభావవంతమైన నాయర్ సర్వీస్ సొసైటీ (NSS), శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం (SNDP) వంటి సంస్థలు, ఆలయ ఆచారాలను పరిరక్షిస్తే ప్రభుత్వానికి మద్దతిస్తామని ప్రకటించాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఈ వర్గాల మద్దతు కూడగట్టేందుకే ప్రభుత్వం బోర్డు ద్వారా ఈ ఎత్తుగడ వేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో, బోర్డు అధ్యక్షుడు ప్రశాంత్ బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. “రెండోసారి అధికారంలోకి వస్తే శబరిమల ఆచారాలను కాపాడేందుకు ప్రత్యేక చట్టం తెస్తామన్న బీజేపీ, ఆ హామీని ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలి” అని ఆయన డిమాండ్ చేశారు.
‘గ్లోబల్ అయ్యప్ప సమావేశం’ : మరోవైపు, భక్తులను ప్రసన్నం చేసుకునేందుకు కేరళ ప్రభుత్వం భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ 20న పంబా నది ఒడ్డున ‘గ్లోబల్ అయ్యప్ప సమావేశం’ నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి వి.ఎన్. వాసవన్ ప్రకటించారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రారంభించే ఈ సదస్సుకు దేశవిదేశాల నుంచి వేలాది మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అయ్యప్ప భక్తుల నుంచి సూచనలు స్వీకరించడం, శబరిమల మాస్టర్ ప్లాన్‌ను వివరించడం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
అసలేంటీ వివాదం : శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు గల మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై, సుప్రీంకోర్టు 2018లో చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. మహిళలను ఆలయంలోకి అనుమతించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ తీర్పు కేరళ వ్యాప్తంగా తీవ్ర నిరసనలకు, హింసాత్మక ఘటనలకు దారితీసింది. అప్పటి నుంచి ఈ అంశం న్యాయస్థానంలో, ప్రజాక్షేత్రంలో నానుతూనే ఉంది.


