Sam Pitroda Controversial Comments: కాంగ్రెస్ ఓవర్సీస్ చీఫ్ శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. పాకిస్థాన్‌తో సహా పొరుగు దేశాల పట్ల ఆయన వ్యక్తం చేసిన సానుభూతిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఒక పాడ్‌కాస్ట్‌లో పిట్రోడా మాట్లాడుతూ.. తాను పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్‌లకు వెళ్లినప్పుడు “సొంత ఇంట్లో ఉన్నట్టు” అనిపించిందని వ్యాఖ్యానించారు. పొరుగు దేశాలతో బలమైన సంబంధాలు ఏర్పరచుకోవాలని అన్నారు. ఈ దేశాలతో మనకు సాంస్కృతిక సారూప్యతతో పాటు.. డీఎన్ఏ సారూప్యత సైతం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
బీజేపీ ఆగ్రహం: పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. బీజేపీ నేత ప్రదీప్ భండారి మాట్లాడుతూ.. పిట్రోడా వ్యాఖ్యలు భారత సైన్యాన్ని అవమానించడమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్‌పై సానుభూతి చూపుతోందని ఆరోపించారు. 26/11 ముంబై దాడుల తర్వాత కూడా అప్పటి యూపీఏ ప్రభుత్వం పాకిస్థాన్‌పై కఠిన చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు.
Also Read:https://teluguprabha.net/national-news/rahul-gandhi-sarcastic-jibe-election-commission-vote-theft/
విదేశాంగ విధానంపై పిట్రోడా అభిప్రాయం: మన విదేశాంగ విధానంలో భాగంగా మొదట పొరుగు దేశాలపై దృష్టి సారించాలని పిట్రోడా అన్నారు. బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించాలని తెలిపారు. పాకిస్థాన్‌తో చర్చలు జరపాలని ఆయన సూచించారు. అయితే, ఆయన ఈ వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని పేర్కొన్నారు. అయినప్పటికీ ఈ వివాదాస్పద కామెంట్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
వివరణ ఇచ్చిన శ్యామ్ పిట్రోడా: తన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో శ్యామ్ పిట్రోడా ‘ఎక్స్’లో వివరణ ఇచ్చారు. బాధలు, ఘర్షణ, ఉగ్రవాద సవాళ్లను తక్కువ చేసి చూపడం తన ఉద్దేశం కాదని అన్నారు. భారత ఉపఖండంలో ప్రజల మధ్య ఉన్న బంధాల గురించే అలా అన్నానని తెలిపారు.


