Bihar CM Samrat Chaudhary: బీహార్ రాజకీయాల్లో నూతన శకం మొదలైంది. బీజేపీ పార్టీ నుండి బీహార్ తొలి ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌధరీ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సయ్యద్ అటా హస్నైన్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
చరిత్ర సృష్టించిన సమ్రాట్ చౌధరీ: నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకోవడంతో బీహార్ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమ్రాట్ చౌధరీ బీహార్ నూతన సీఎంగా బాధ్యతలు చేపట్టారు. పాట్నాలోని లోక్ భవన్‌లో గవర్నర్ సయ్యద్ అటా హస్నైన్.. ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో బీహార్‌లో బీజేపీ తరపున ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తొలి వ్యక్తిగా సమ్రాట్ చౌధరీ చరిత్ర సృష్టించారు.
Also read-Supreme Court: ఎన్నికల నిర్వహణపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు
ఓబీసీ వర్గాల్లో బలమైన పట్టు: సమ్రాట్ చౌధరీ ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. 1968లో రాజకీయ కుటుంబంలో సమ్రాట్ చౌధరీ జన్మించారు. తన చిన్నతనం నుండే ప్రజా సమస్యలపై పోరాడేతత్వాన్ని అలవరుచుకున్నారు. తన పోరాట చతురతతో రాష్ట్రస్థాయిలో బలమైన నేతగా ఎదిగారు. గతంలో బీహార్ ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. బీహార్‌లోని ఓబీసీ సామాజిక వర్గాల్లో బలమైన పట్టుంది. ముఖ్యంగా కోయిరీ, కుష్వాహ వర్గాల్లో ఆయనకు ఉన్న ఆదరణను బీజీపీ అధిష్టానం గుర్తించింది. అందుకే సమ్రాట్ చౌధరీని సీఎం అభ్యర్థిగా బీజేపీ పెద్దలు ప్రకటించారు.

