Sanjay Raut questions Jagdeep Dhankhar’s safety : భారత మాజీ ఉపరాష్ట్రపతి… దేశానికి రెండో అత్యున్నత పౌరుడిగా సేవలందించిన వ్యక్తి… హఠాత్తుగా ఏమయ్యారు..? ఆయన క్షేమంగానే ఉన్నారా..? లేక ఆయన అదృశ్యం వెనుక ఏమైనా ఆందోళనకరమైన అంశాలు దాగి ఉన్నాయా? ఈ ప్రశ్నలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ జాడ తెలియడం లేదంటూ, ఆయన భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ శివసేన (యూబీటీ) సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకే లేఖ రాయడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. అసలేం జరిగింది..? ఈ వివాదం ఎందుకు మొదలైంది..?
అంతుచిక్కని ఆచూకీ.. ఆందోళనలో విపక్షాలు : గత జులై 21న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే, అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఆరోగ్య సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన రాష్ట్రపతికి సమర్పించిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అయితే, ఆ పరిణామం జరిగిన నాటి నుంచి ఆయన మళ్లీ బహిరంగంగా కనిపించలేదు. ఆయనతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నించినప్పటికీ, ఎవరికీ అందుబాటులోకి రావడం లేదని, ఇదే తమ ఆందోళనకు ప్రధాన కారణమని సంజయ్ రౌత్ తన లేఖలో స్పష్టం చేశారు. ఆగస్టు 10న అమిత్ షాకు రాసిన ఈ లేఖను ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
“దేశం నిజం తెలుసుకోవాలి” – రౌత్ డిమాండ్ : “మాజీ ఉపరాష్ట్రపతి ఎక్కడ ఉన్నారో మాకు ఎలాంటి సమాచారం లేదు. ఆయన ప్రస్తుత నివాసం, ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత కొరవడింది. రాజ్యసభలోని కొందరు సభ్యులు ఆయనను సంప్రదించేందుకు విఫలయత్నం చేశారు,” అని రౌత్ తన లేఖలో పేర్కొన్నారు. “ప్రస్తుతం ధన్‌ఖడ్ దిల్లీలోని తన నివాసానికే పరిమితమయ్యారని, ఆయన ఏమాత్రం సురక్షితంగా లేరని తీవ్రమైన వదంతులు వ్యాపిస్తున్నాయి. ఆయనతో గానీ, ఆయన సిబ్బందితో గానీ ఎలాంటి సంప్రదింపులు జరపడం సాధ్యపడటం లేదు. ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశం. మన మాజీ ఉపరాష్ట్రపతికి నిజంగా ఏం జరిగింది..? ఆయన ఎక్కడున్నారు..? ఆయన సురక్షితంగానే ఉన్నారా..? అనే ప్రశ్నలకు దేశం సమాధానం కోరుకుంటోంది,” అంటూ రౌత్ ఘాటుగా ప్రశ్నించారు. కేవలం రౌత్ మాత్రమే కాకుండా, గతవారమే శివసేన యూబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే కూడా ధన్‌ఖడ్ ఆచూకీపై ప్రశ్నలు లేవనెత్తడం గమనార్హం.
‘హెబియస్ కార్పస్’ పిటిషన్ వేస్తాం : ధన్‌ఖడ్ ఆచూకీపై ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోతే న్యాయపోరాటానికి దిగుతామని సంజయ్ రౌత్ హెచ్చరించారు. “రాజ్యసభలో చాలా మంది సభ్యులు ధన్‌ఖడ్ గురించి నిజంగా ఆందోళన చెందుతున్నారు. అందుకే ఆయన ఆచూకీ తెలపాలని కోరుతూ సుప్రీంకోర్టులో ‘హెబియస్ కార్పస్’ రిట్ పిటిషన్ దాఖలు చేయాలని ఆలోచిస్తున్నాం. అయితే, అత్యున్నత న్యాయస్థానం తలుపులు తట్టే ముందు, మీ (అమిత్ షా) నుంచి సరైన సమాచారం వస్తుందని ఆశిస్తున్నాను,” అని రౌత్ తన లేఖను ముగించారు.
ఈ లేఖ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఒక మాజీ ఉపరాష్ట్రపతి భద్రత, ఆచూకీపై ప్రతిపక్ష నేత నేరుగా హోంమంత్రికే లేఖ రాయడం అసాధారణ పరిణామం. దీనిపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎలా స్పందిస్తుందో, ధన్‌ఖడ్ ఆచూకీపై నెలకొన్న ఉత్కంఠకు ఎప్పుడు తెరపడుతుందో వేచి చూడాలి.


