Sunday, November 16, 2025
Homeనేషనల్Rahul Gandhi : రాహుల్ వ్యాఖ్యలపై సుప్రీం ఘాటు స్పందన! 'నిజమైన భారతీయుడైతే..?'

Rahul Gandhi : రాహుల్ వ్యాఖ్యలపై సుప్రీం ఘాటు స్పందన! ‘నిజమైన భారతీయుడైతే..?’

Rahul Gandhi Supreme Court Remarks : భారత సైన్యం గురించి విమర్శలు చేసేటప్పుడు నాయకులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలనే సందేశాన్ని సుప్రీంకోర్టు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఇచ్చిన తీర్పు ద్వారా స్పష్టం చేసింది. సైన్యం మనోధైర్యం, దేశ భద్రత వంటి సున్నితమైన అంశాలపై మాట్లాడేటప్పుడు పదాల ఎంపిక ఎంత కీలకమో ఈ సంఘటన తెలియజేస్తుంది. “మీరు నిజమైన భారతీయులైతే సైన్యం గురించి అలాంటి వ్యాఖ్యలు చేయరు” అంటూ తీవ్ర స్వరంతో మందలించింది. చైనా మన భూభాగాన్ని ఆక్రమించిందనడానికి మీ వద్ద ఉన్న ఆధారాలేమిటి…? అంటూ నిలదీసింది. ఈ వ్యాఖ్యలతో దేశ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి. అసలు రాహుల్ గాంధీ ఏమన్నారు..? సుప్రీంకోర్టు ఎందుకింత తీవ్రంగా స్పందించింది? ఈ కేసు పూర్వాపరాలేమిటి..?

- Advertisement -

సుప్రీంకోర్టులో ఏం జరిగింది : భారత సైన్యంపై చేసిన వ్యాఖ్యలకు గానూ రాహుల్ గాంధీపై లఖ్‌నవూ కోర్టులో దాఖలైన పరువు నష్టం దావా కేసు సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ విచారణ సందర్భంగా రాహుల్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆధారాలు ఎక్కడ: 2 వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని మీకెలా తెలుసు…? మీరు స్వయంగా అక్కడ ఉన్నారా..? మీ వద్ద విశ్వసనీయమైన ఆధారాలు ఏమైనా ఉన్నాయా?”

దేశ భక్తిపై పాఠం : “దేశభక్తిని ప్రదర్శించడంలో సైనికుల త్యాగాలను గౌరవించడం ఒక భాగం. కాబట్టి, మన సైన్యం మనోధైర్యాన్ని దెబ్బతీయని విధంగా మాట్లాడటం మనందరి బాధ్యత.”

వేదిక పార్లమెంట్, సోషల్ మీడియా కాదు: “మీరు ప్రతిపక్ష నాయకుడు. ఏమైనా చెప్పదలుచుకుంటే పార్లమెంటు వేదికగా మాట్లాడండి, అంతేకానీ సోషల్ మీడియా పోస్టులలో కాదు” అని ధర్మాసనం హితవు పలికింది. అదే సమయంలో, ఈ కేసులో లఖ్‌నవూ కోర్టులో రాహుల్ గాంధీపై జరుగుతున్న విచారణపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

రాహుల్ తరఫున వాదనలు : రాహుల్ గాంధీ తరఫు న్యాయవాదిగా అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. “దేశంలో జరుగుతున్న పరిణామాలను, సమస్యలను ప్రశ్నించకపోతే ఆయన ప్రతిపక్ష నేత ఎలా అవుతారు..? పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగానే రాహుల్ ఆ వ్యాఖ్యలు చేశారు. మన 20 మంది సైనికులను చైనా సైన్యం పొట్టనబెట్టుకున్నప్పుడు, ఒక నిజమైన భారతీయుడు ఆందోళన చెందడం సహజం” అని ఆయన కోర్టుకు విన్నవించారు. అయితే, ఈ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు.

అసలు వివాదానికి కారణమైన రాహుల్ వ్యాఖ్యలు : 2022లో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ‘భారత్ జోడో యాత్ర’ చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ యాత్ర సందర్భంగా, అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన తర్వాత రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే, మన ప్రభుత్వం నిద్రపోతోంది. చైనా మన భూభాగాన్ని (సుమారు 2000 చ.కి.మీ) ఆక్రమించింది. మన సైనికులను కొడుతోంది. కానీ ప్రధాని మోదీ మాత్రం అసలు ఆక్రమణే జరగలేదని అబద్ధాలు చెబుతున్నారు” అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి.

కేసు ప్రస్థానం : రాహుల్ వ్యాఖ్యలు సైన్యాన్ని అవమానించేలా ఉన్నాయని ఆరోపిస్తూ లఖ్‌నవూకు చెందిన ఓ న్యాయవాది స్థానిక కోర్టులో పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్ గాంధీ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ ఆయనకు చుక్కెదురైంది. దీంతో రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అత్యున్నత న్యాయస్థానం పై విధంగా ఘాటు వ్యాఖ్యలు చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad