UPI payments in Indian schools : ఇకపై పాఠశాల ఫీజులు చెల్లించడానికి గంటల తరబడి క్యూలలో నిలబడాల్సిన పనిలేదు. చిల్లర కోసం వెతుక్కోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల విప్లవం కొనసాగుతున్న వేళ, విద్యా రంగంలోనూ ఆ సంస్కరణల గాలి వీస్తోంది. పాఠశాలల్లో ఫీజుల చెల్లింపు కోసం యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ విధానాలను ప్రోత్సహించాలని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలకు కీలక సూచనలు జారీ చేసింది. అసలు ఈ నిర్ణయం వెనుక ఉన్న పూర్తి ఉద్దేశాలేంటి..? దీనివల్ల తల్లిదండ్రులకు, పాఠశాలలకు కలిగే ప్రయోజనాలేమిటి..?
దేశ ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ లావాదేవీలు అంతర్భాగంగా మారిన ప్రస్తుత తరుణంలో, విద్యా సంస్థల ఆర్థిక వ్యవహారాల్లోనూ పారదర్శకత, సౌలభ్యం తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ ముందడుగు వేసింది. పాఠశాల ఫీజులు, అడ్మిషన్ రుసుములు, పరీక్షల ఫీజులు వంటి అన్ని రకాల చెల్లింపులను డిజిటల్ విధానంలో స్వీకరించేలా చర్యలు చేపట్టాలని కేంద్ర విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. తల్లిదండ్రులు, విద్యార్థులపై భారం తగ్గించి, సులభతరమైన చెల్లింపు విధానాలను అందుబాటులోకి తేవడమే దీని ముఖ్య ఉద్దేశం.
సీబీఎస్‌ఈ, కేంద్రీయ విద్యాలయాలకూ ఆదేశాలు: ఈ మార్పు కేవలం రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం కాదు. జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE), కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS), నవోదయ విద్యాలయ సమితి (NVS) వంటి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని విద్యా సంస్థలకు కూడా ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. తమ పరిధిలోని పాఠశాలల్లో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను వెంటనే ప్రారంభించేందుకు అవసరమైన సాంకేతిక మౌలిక వసతులను సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేసింది.
నగదు నుంచి డిజిటల్.. ప్రయోజనాలెన్నో : కేంద్ర విద్యాశాఖ ప్రకారం, నగదు ఆధారిత చెల్లింపుల నుంచి డిజిటల్ విధానాలకు మారడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
తల్లిదండ్రులకు సౌలభ్యం: తల్లిదండ్రులు పాఠశాల వరకు రానవసరం లేకుండా, ఇంటి నుంచే తమ మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా క్షణాల్లో ఫీజులు చెల్లించవచ్చు. ఇది వారి విలువైన సమయాన్ని ఆదా చేస్తుంది.
పారదర్శకతకు పెద్దపీట: ప్రతి లావాదేవీకి డిజిటల్ రసీదు వస్తుంది. అన్ని చెల్లింపులు రికార్డు రూపంలో భద్రంగా ఉంటాయి. ఇది పాఠశాలల ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణను సులభతరం చేస్తుంది, పారదర్శకతను పెంచుతుంది.
క్యూలకు చెల్లుచీటీ: పాఠశాల కౌంటర్ల వద్ద ఫీజుల కోసం గంటల తరబడి బారులు తీరే దృశ్యాలకు తెరపడుతుంది.
ఆర్థిక అక్షరాస్యత: విద్యార్థులు, తల్లిదండ్రులు డిజిటల్ లావాదేవీలకు అలవాటు పడటం వల్ల దేశంలో ఆర్థిక అక్షరాస్యత పెరుగుతుంది.
‘డిజిటల్ భారత్’ లక్ష్య సాధనలో కీలక అడుగు: ‘డిజిటల్ భారత్’ లక్ష్య సాధనలో విద్యా రంగం కీలక పాత్ర పోషించగలదని విద్యాశాఖ అభిప్రాయపడింది. ఫీజుల చెల్లింపుతో మొదలైన ఈ మార్పు, భవిష్యత్తులో పాఠశాలల నిర్వహణలోని ఇతర అంశాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. ఈ కొత్త విధానం ద్వారా పాఠశాలల ఆర్థిక నిర్వహణ మరింత సమర్థవంతంగా మారడమే కాకుండా, విద్యార్థులు చిన్న వయసు నుంచే డిజిటల్ ఆర్థిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవడానికి దోహదపడుతుందని కేంద్ర విద్యాశాఖ విశ్వాసం వ్యక్తం చేసింది.


