గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేటితో ముగిసింది. డిసెంబర్ 1న తొలిదశ ఎన్నికలు జరుగగా..నేడు రెండోదశ ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 8 గంటల నుండి పోలింగ్ ప్రక్రియ మొదలవ్వగా.. ప్రధాని మోదీ, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, పాటిదార్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వంటి ప్రముఖులు సహా.. ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5.30 గంటల వరకూ జరిగిన పోలింగ్ ను బట్టి.. రెండో విడత ఎన్నికల్లో 59 శాతం ఓటింగ్ నమోదైంది.
14 జిల్లాల్లో 93 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో.. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 833 మంది బరిలో ఉన్నారు. తొలివిడత ఎన్నికల్లో 89 స్థానాలకు ఓటింగ్ నిర్వహించారు. మొత్తం 182 స్థానాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8న వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో దేశమంతటి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై ఉంది. ఎగ్జిట్ పోల్స్ ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాహుల్ భారత్ జోడో యాత్ర ఈ ఎన్నికలపై ప్రభావం చూపిందో లేదో తెలియాలంటే మూడ్రోజులు ఆగాల్సిందే.