ఉత్తరప్రదేశ్ ఝాన్సీ (Jhansi) లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజ్ లోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో మంటలు వ్యాపించి పది మంది చిన్నారులు సజీవ దహనం అయ్యారు. తొలుత ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు భావించారు. అయితే ఓ నర్సు నిర్లక్ష్యం కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు.
ఝాన్సీలోని హమీపూర్ కు చెందిన భగవాన్ దాస్ అనే వ్యక్తి కుమారుడు నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ లోనే చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో భగవాన్ దాస్ కూడా అక్కడే ఉన్నాడు. అదే యూనిట్లో డ్యూటీలో ఉన్న ఓ నర్సు ఆక్సిజన్ సిలిండర్ పైపును కనెక్ట్ చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న మరో నర్సు అగ్గిపుల్ల వెలిగించిందని, అందువల్లే ఈ ప్రమాదం జరిగిందని భగవాన్ దాస్ ఆరోపించాడు.
ఆక్సిజన్ అధికంగా ఉన్న ప్రదేశం కావడంతో క్షణాల్లో మంటలు చెలరేగాయని సాక్షి తెలిపాడు. వెంటనే అప్రమత్తమై తన కుమారుడితో సహా నలుగురు పిల్లలను బట్టలో చుట్టుకుని బయటకు పరిగెత్తానని చెప్పాడు. అక్కడున్న వారి సాయంతో మరికొంతమంది చిన్నారులను కాపాడగలిగామని వెల్లడించాడు. అయితే ప్రమాద సమయంలో సేఫ్టీ అలారాలు మోగకపోవడం, వార్డులో గడువు ముగిసిన అగ్నిమాపక పరికరాలు ఉండటంతో అందరూ చిన్నారులను రక్షించలేకపోయామని భగవాన్ దాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ప్రమాదంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి బ్రదర్ స్పందిస్తూ… అగ్ని ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.