Seven people died in a collision between two buses: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సూరత్ జిల్లా బర్డోలీలో రెండు బస్సులు ఒకదానికొకటి ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. 40 మందికిపైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నేటి (మంగళవారం) సాయంత్రం మహారాష్ట్రకు చెందిన బస్సు బర్డోలీ వద్ద ట్రాక్టర్‌ను తప్పించబోయి అదుపుతప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న మరో ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు సూరత్ ఎస్పీ వెల్లడించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ రెండు బస్సులూ మహారాష్ట్ర ఆర్టీసీకి చెందినవేనని పోలీసులు స్పష్టం చేశారు. బస్సులు పరస్పరం ఢీకొట్టుకోవడంతో ఒక బస్సులో మంటలు చెలరేగాయన్నారు. ఈ బస్సుల్లో చిక్కుకున్న ప్రయాణికులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. సూరత్‌తో పాటు పక్కనే ఉన్న తాపి జిల్లా పోలీసులు సైతం ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారని వెల్లడించారు.
ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం
కాగా, ఈ ఘోర రోడ్డు ప్రమద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని.. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ కింద రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుదని తెలిపారు.

