Saturday, November 15, 2025
Homeనేషనల్Sexual Consent Age: 'సెక్స్ సమ్మతి' వయసుపై.... సుప్రీంకోర్టులో కీలక వాదనలు!

Sexual Consent Age: ‘సెక్స్ సమ్మతి’ వయసుపై…. సుప్రీంకోర్టులో కీలక వాదనలు!

Sexual Consent Age In India: దేశంలో లైంగిక నేరాల నుంచి బాలలను రక్షించడానికి ఉద్దేశించిన పోక్సో చట్టంలోని ఓ కీలక అంశంపై సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. లైంగిక కార్యకలాపాలకు సమ్మతించే  వయసును ప్రస్తుతమున్న 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలంటూ… అమికస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ సర్వోన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. కౌమారదశలో ఉన్నవారి మధ్య ఏకాభిప్రాయంతో జరిగే ప్రేమ సంబంధాలను నేరంగా పరిగణించడం వారి ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని ఆమె గట్టిగా వాదించారు. ఈ వాదనలు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీశాయి. ఇంతకీ, ఈ విజ్ఞప్తి వెనుక ఉన్న కారణాలేంటి..? చట్టం దుర్వినియోగం అవుతోందా..? దీనిపై గతంలో న్యాయ నిపుణులు ఏమన్నారు..?

- Advertisement -

పోక్సో చట్టం 2012, ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం 16 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న వారి మధ్య లైంగిక కార్యకలాపాలను క్రైమ్ గా పరిగణించడాన్ని సవాల్ చేస్తూ ఇందిరా జైసింగ్ సుప్రీంకోర్టులో తన వాదనలు వినిపించారు. 

కౌమార ప్రేమ నేరమా: ప్రస్తుతం అందుబాటులో ఉన్న చట్ట ప్రకారం కౌమారదశలో ఉన్నవారి మధ్య అంగీకారంతో కూడిన ప్రేమ సంబంధాలను తప్పుగా చిత్రీకరిస్తోందని, వారి వ్యక్తిగత స్వయంప్రతిపత్తిని, పరిణతిని విస్మరిస్తోందని జైసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ALSO READ: https://teluguprabha.net/national-news/rahul-gandhi-warns-election-commission-voter-fraud/

చర్చ లేకుండానే పెంపు: లైంగిక సమ్మతి వయసును 16 నుంచి 18 ఏళ్లకు పెంచడానికి ఎలాంటి శాస్త్రీయ, గణాంక ఆధారాలు లేవని, సరైన చర్చ జరగకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆమె పేర్కొన్నారు. ఇది జస్టిస్ వర్మ కమిటీ సిఫార్సుకు పూర్తి విరుద్ధమని గుర్తుచేశారు.

పెరిగిన పోక్సో కేసులు: 2017-2021 మధ్యకాలంలో 16-18 ఏళ్ల వయసు వారిపై నమోదైన పోక్సో కేసులు 180 శాతం పెరిగాయని, ఇది చట్టం యొక్క పర్యవసానాలను సూచిస్తోందని ఆమె గణాంకాలతో సహా వివరించారు.

తల్లిదండ్రుల ఫిర్యాదులే అధికం: నమోదవుతున్న అనేక పోక్సో కేసులలో బాధితులు కాకుండా, వారి తల్లిదండ్రులే ఫిర్యాదుదారులుగా ఉంటున్నారని జైసింగ్ తెలిపారు. ముఖ్యంగా కులాంతర లేదా మతాంతర ప్రేమ వివాహాల విషయంలోనే ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని ఆమె కోర్టు దృష్టికి తెచ్చారు.

ALSO READ: https://teluguprabha.net/national-news/supreme-court-stays-acquittal-mumbai-train-blasts-case/

హైకోర్టుల వ్యాఖ్యలను ఉటంకిస్తూ : గతంలో బొంబాయి, మద్రాస్, మేఘాలయ వంటి పలు హైకోర్టులు పోక్సో చట్టంపై చేసిన వ్యాఖ్యలను ఇందిరా జైసింగ్ ఉదహరించారు. కౌమారదశలో ఉన్న అబ్బాయిలను ఈ చట్టం కింద విచారించడంపై ఆయా కోర్టులు అసంతృప్తి వ్యక్తం చేశాయని, మైనర్లతో సంబంధం ఉన్న అన్ని లైంగిక చర్యలను బలవంతంగా పరిగణించలేమని స్పష్టం చేశాయని ఆమె గుర్తుచేశారు. ఏకాభిప్రాయ సంబంధాలకూ, చట్ట దుర్వినియోగానికీ మధ్య ఉన్న తేడాను గుర్తించాలని హైకోర్టులు నొక్కి చెప్పిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు.

లా కమిషన్ ఏమందంటే : కొంతకాలం క్రితం, ఇదే అంశంపై లా కమిషన్ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. లైంగిక కార్యకలాపాలకు సమ్మతి తెలిపే కనీస వయస్సును 18 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలకు తగ్గించాలన్న వాదనను లా కమిషన్ తోసిపుచ్చింది. పోక్సో చట్టం ప్రకారం ప్రస్తుతమున్న 18 ఏళ్ల వయసు నిబంధనను మార్చడం మంచిది కాదని పేర్కొంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇందిరా జైసింగ్ చేసిన వాదనలతో ఈ అంశం మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది. కౌమారదశలో ఉన్న వారి హక్కులు, వారి రక్షణ మధ్య సమతుల్యతను సాధించడంలో న్యాయవ్యవస్థ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad