Sharad Pawar NCP Merger Comments : రాజకీయ చదరంగంలో అపర చాణక్యుడిగా పేరొందిన ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. సొంత గూటి పక్షులు కలిసే వేళ.. బయటి వ్యక్తి పెత్తనం ఎందుకంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ను సూటిగా ప్రశ్నించారు. “మా ఇంటి వ్యవహారంలో మీ జోక్యం అనవసరం” అన్న రీతిలో పవార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఎన్సీపీలోని రెండు వర్గాల విలీనంపై జరుగుతున్న చర్చల్లో అసలు ఫడణవీస్ పాత్రే లేదని కుండబద్దలు కొట్టారు.
ఆయనకు మాట్లాడే హక్కు లేదు : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాల విలీనంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ చేస్తున్న వ్యాఖ్యలను శరద్ పవార్ తీవ్రంగా తప్పుబట్టారు. విలీన ప్రక్రియ అనేది పూర్తిగా పార్టీ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు. “విలీన చర్చలు అజిత్ పవార్, జయంత్ పాటిల్ మధ్యే జరిగాయి. ఆ గదిలో ముఖ్యమంత్రి ఫడణవీస్ లేరు. అసలు ఆ చర్చల్లో పాల్గొనని వ్యక్తికి, దాని గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది?” అని పవార్ నిలదీశారు. వాస్తవాలు తెలియకుండా బహిరంగ ప్రకటనలు చేయడం తగదని హితవు పలికారు.
సునేత్రా ప్రమాణంపై సంతోషం.. కానీ : కుటుంబంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై కూడా శరద్ పవార్ స్పందించారు. అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. “ఆమె డిప్యూటీ సీఎం కావడం నాకు వ్యక్తిగతంగా సంతోషాన్నిచ్చింది” అని తెలిపారు. అయితే, ప్రస్తుతం తన కుటుంబం విషాద పరిస్థితుల్లో ఉందని, ఇలాంటి సమయంలో రాజకీయ నిర్ణయాలపై ఎలాంటి చర్చలు జరపడం లేదని ఆయన స్పష్టం చేశారు.
అసలు చర్చ ఎవరి మధ్య : ఎన్సీపీ ఏకీకరణ దిశగా అడుగులు పడుతున్నాయన్న వార్తల నేపథ్యంలో పవార్ క్లారిటీ ఇచ్చారు. చర్చలన్నీ అజిత్ పవార్, ఎన్సీపీ (ఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ మధ్యే కేంద్రీకృతమై ఉన్నాయని, ఇందులో బీజేపీకి గానీ, ఫడణవీస్‌కు గానీ ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ పాత్రను పరిమితం చేసేలా పవార్ పావులు కదుపుతున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

