Sharad pawar on maharastra Deputy CM : మహారాష్ట్ర రాజకీయ యవనికపై ‘పవార్’ల మధ్య సాగుతున్న హైడ్రామా మరో కీలక మలుపు తిరిగింది. అజిత్ పవార్ హఠాన్మరణం తర్వాత ఆ శూన్యాన్ని పూడ్చేందుకు ఆయన సతీమణి, రాజ్యసభ ఎంపీ సునేత్ర పవార్‌ను ఉపముఖ్యమంత్రి పీఠం వరించబోతోందన్న వార్తలు మరాఠా గడ్డపై దావానలంలా వ్యాపించాయి. రాష్ట్ర కేబినెట్‌లో చోటుచేసుకోబోయే ఈ భారీ మార్పుపై యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ, ఎన్సీపీ (ఎస్సీపీ) అధినేత శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
బారామతి వేదికగా క్లారిటీ: మీడియా ద్వారానే తెలిసింది : శనివారం బారామతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శరద్ పవార్ అత్యంత నిశ్శబ్దంగా, అదే సమయంలో లోతైన అర్థాలు ధ్వనించేలా మాట్లాడారు.
సమాచార లోపం – వ్యూహాత్మక మౌనం: సునేత్ర పవార్ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్న వార్తలపై స్పందిస్తూ.. “నాకు ఆ విషయం తెలియదు. మీడియాలో వస్తున్న కథనాల ద్వారానే నేను తెలుసుకున్నాను” అని పవార్ పేర్కొన్నారు. కుటుంబ రాజకీయాల్లో అత్యంత పట్టున్న నేతగా పేరున్న శరద్ పవార్‌కు, తన కోడలి పదోన్నతి గురించి తెలియదని చెప్పడం వెనుక రాజకీయ వ్యూహం ఉందన్న చర్చ మొదలైంది.
నిర్ణయం ఆ నేతలదేనా : ఈ నిర్ణయం పార్టీ స్థాయిలో జరిగి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అజిత్ పవార్ వర్గానికి చెందిన కీలక నేతలు ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే వంటి వారు ఈ అంశంలో చొరవ తీసుకుని ఉండవచ్చని, వారు తీసుకున్న నిర్ణయం గురించి తనకు ముందస్తు సమాచారం లేదని స్పష్టం చేశారు.
విలీనంపై అజిత్ పవార్ కల: అజిత్ పవార్ మరణం తర్వాత ఆయన ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత అందరిపై ఉందని శరద్ పవార్ గుర్తుచేశారు. “అజిత్ పవార్, శశికాంత్ శిందే, జయంత్ పాటిల్.. ఎన్సీపీలోని రెండు వర్గాలను ఏకం చేసేందుకు చర్చలు జరిపారు. ఫిబ్రవరి 12న విలీనం జరగాలని ముహూర్తం కూడా నిశ్చయించుకున్నారు. కానీ దురదృష్టవశాత్తూ ఆ తేదీ రాకముందే అజిత్ మనల్ని విడిచి వెళ్ళిపోయారు” అని పవార్ భావోద్వేగానికి లోనయ్యారు.

