Sunday, November 16, 2025
Homeనేషనల్Sharmistha Mohanty : ఆ గిరిజన పల్లెల 'అమ్మ'.. 32 ఏళ్లుగా అక్షర దీపం!

Sharmistha Mohanty : ఆ గిరిజన పల్లెల ‘అమ్మ’.. 32 ఏళ్లుగా అక్షర దీపం!

Sharmistha Mohanty Juang tribe : ఒక పరిశోధన ఆమె జీవితాన్నే మార్చేసింది. గిరిజనుల దీనస్థితి ఆమెను కదిలించింది. తన కలలను, కుటుంబాన్ని, సొంతూరిని వదిలేసి, ఆ అడవి బిడ్డలకే తన జీవితాన్ని అంకితం చేసింది. గత 32 ఏళ్లుగా ఒడిశాలోని మారుమూల అటవీ ప్రాంతంలో ఏకధాటిగా విద్యా విప్లవానికి నాంది పలుకుతోంది. ఆమె పేరు శర్మిష్ఠ మొహంతి.. కానీ ఆ 47 గిరిజన కుగ్రామాలకు ఆమె ‘గుని ఆపా’ (అమ్మ). ఇంతకీ ఎవరీమె.? ఒక సామాన్య మహిళ ఇంతటి మహత్తర యజ్ఞాన్ని ఎలా ప్రారంభించింది..?

- Advertisement -

పరిశోధన కోసం వెళ్లి.. సేవకురాలిగా మారి : ఒడిశాలోని జగత్‌సింగ్‌పుర్ జిల్లాకు చెందిన శర్మిష్ఠ మొహంతి, ఎం.ఫిల్ పరిశోధనలో భాగంగా, 1993లో కియోంఝర్ జిల్లాలోని జువాంగ్ ఆదివాసీ తెగపై అధ్యయనం చేయడానికి కుజారన్ గ్రామానికి వెళ్లారు. అక్కడి ప్రజల దుర్భర జీవితం, పేదరికం, అజ్ఞానం, జనజీవన స్రవంతికి దూరంగా వారు బతుకుతున్న తీరు ఆమెను తీవ్రంగా చలింపజేశాయి. “జువాంగ్ తెగ కోసం ఏదైనా చేయాలి” అనే బలమైన సంకల్పంతో, తన పరిశోధనను, ఉన్నత చదువులను పక్కనపెట్టి, అదే గ్రామంలో ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. కుటుంబాన్ని ఒప్పించి, ఆ అడవి పల్లెనే తన సొంతూరిగా మార్చుకున్నారు.

మీరు చదివిస్తే.. మా పిల్లలు చదువుతారు’ : “నేను కొత్తగా వచ్చినప్పుడు నన్ను చూసి పిల్లలు పారిపోయేవారు. ఒంటిపై బట్టలు కూడా ఉండేవి కావు. బడి ఉన్నా, మాస్టారు లేరని గ్రామస్థులు చెప్పారు. ‘మీరు చదివిస్తే మా పిల్లలు చదువుతారు’ అని ఓ తండ్రి అన్న మాటతో, పాఠశాల ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను,” అని శర్మిష్ఠ తన ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు.

తొలి అడుగు: 1993లో కేవలం 30 మంది పిల్లలతో ‘అనంత శిక్షా నికేతన్’ పేరుతో ఓ చిన్న పాఠశాలను ప్రారంభించారు.

గురుకులం: 1994లో పిల్లల కోసం గురుకుల ఆశ్రమ పాఠశాలను మొదలుపెట్టారు. అదే నేడు ‘జ్ఞాన విజ్ఞాన్ విద్యాలయం’గా రూపుదిద్దుకుంది.

ఉచిత విద్య: ఈ ఇంగ్లీష్ మీడియం గురుకులంలో 1 నుంచి 10వ తరగతి వరకు 47 గ్రామాలకు చెందిన గిరిజన పిల్లలకు ఉచిత విద్య, వసతి అందిస్తున్నారు.

కేవలం చదువే కాదు.. సంపూర్ణ వికాసం : ఈ పాఠశాలలో కేవలం అక్షరాలు నేర్పడమే కాదు, పిల్లల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తారు. పాటలు, నృత్యాలు, క్రీడలతో పాటు భగవద్గీతను కూడా బోధిస్తారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ, మొక్కలు నాటడం, గోసేవ చేయడం నేర్పుతారు. శర్మిష్ఠ స్వయంగా పిల్లలకు ఆహారం వడ్డిస్తూ, వారి ఆలనాపాలనా చూసుకుంటారు. అందుకే ఆమెను అక్కడి ప్రజలు ప్రేమగా ‘గుని ఆపా’ అని పిలుచుకుంటారు.

పాఠశాల నిర్వహణ.. సామాజిక పోరాటం : ఈ బృహత్తర కార్యక్రమానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? సమీపంలోని శాంతి ఆశ్రమంలో పండించే దాల్చిన చెక్క, పసుపు, నిమ్మగడ్డి వంటి వాటిని, గోశాలలోని పాల ఉత్పత్తులను అమ్మి వచ్చిన డబ్బుతోనే పాఠశాలను నిర్వహిస్తున్నారు.

ఆమె సేవ కేవలం విద్యకే పరిమితం కాలేదు. బాల్య వివాహాలను ఆపారు, మూఢనమ్మకాలపై పోరాడారు, మద్యపాన వ్యతిరేక ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. “గత 30 ఏళ్లలో దాదాపు 8 లక్షల మొక్కలు నాటాను. నేను బతికున్నంత వరకు జువాంగ్ తెగ ప్రజల అభ్యున్నతే నా ధ్యేయం,” అని ఆమె ఎంతో నిబద్ధతతో చెబుతారు.

ఆమె పాఠశాలలో చదివి, నేడు అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న చంచలా జువాంగ్ మాటల్లో,మా దగ్గర డబ్బుల్లేకున్నా గుని ఆపా మమ్మల్ని ఉచితంగా చదివించారు. ఆమె వల్లే మా బతుకులు మారాయి.” ఈ ఒక్క మాట చాలు, ఆ అడవి తల్లి నిస్వార్థ సేవకు నిలువుటద్దం పట్టడానికి.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad