Shashi Tharoor’s cautious reaction to Donald Trump : నిన్నటి వరకు భారత్‌పై విమర్శల వర్షం కురిపించి, ‘చీకటి చైనా చేతుల్లోకి వెళ్ళిపోయింది’ అంటూ ఆరోపణలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఒక్కసారిగా స్వరం మార్చారు. ప్రధాని మోదీ తనకు మంచి మిత్రుడని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సానుకూల వ్యాఖ్యలు చేశారు. ఈ ఊహించని మార్పును ప్రధాని మోదీ స్వాగతించగా, కాంగ్రెస్ సీనియర్ నేత, దౌత్య వ్యవహారాల నిపుణుడు శశి థరూర్ మాత్రం ఆచితూచి స్పందించారు. “ట్రంప్ కొత్త స్వరాన్ని జాగ్రత్తగా స్వాగతిస్తున్నాను, కానీ ఆ మాటల వెనుక అసలు అర్థమేమిటో తెలుసుకోవాలి,” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అసలు ట్రంప్ మాటల్లోని అంతరార్థం ఏంటి..? థరూర్ ఎందుకంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు..?
“గాయాలు అంత తేలిగ్గా మానవు” – థరూర్ హెచ్చరిక : ట్రంప్ సానుకూల వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి వేగంగా స్పందించడాన్ని థరూర్ సమర్థించారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోందనే సందేశం ఇవ్వడం అవసరమని అన్నారు. అయితే, మాటలు మాత్రమే సరిపోవని, చేతల్లో కూడా మార్పు కనిపించాలని ఆయన స్పష్టం చేశారు.
సుంకాల దెబ్బ: “ట్రంప్ విధించిన సుంకాలు భారత ప్రజలపై, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపాయి. ఆ నష్టాన్ని, అవమానాన్ని అంత తేలిగ్గా మర్చిపోలేం, క్షమించలేం,” అని థరూర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
చేయాల్సింది చాలా ఉంది: కేవలం పైపైన మాటలతో కాకుండా, ఇరు దేశాల ప్రభుత్వాలు, రాయబారులు కలిసి క్షేత్రస్థాయిలో ఉన్న వాణిజ్యపరమైన సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు.
రష్యా చమురుపై అమెరికాకు చురకలు : రష్యాతో భారత్ చమురు ఒప్పందాలపై అమెరికా వాణిజ్య కార్యదర్శి చేసిన వ్యాఖ్యలకు కూడా థరూర్ అంతే దీటుగా బదులిచ్చారు.
క్షమాపణ చెప్పం: “మేము ఎవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో అమెరికా ప్రభుత్వాలే ప్రపంచ చమురు ధరలను స్థిరంగా ఉంచడం కోసం మమ్మల్ని రష్యా నుంచి చమురు కొనమని ప్రోత్సహించాయి,” అని ఆయన గుర్తుచేశారు.
చైనా, యూరప్ మాటేంటి : “రష్యా నుంచి మనకంటే ఎక్కువగా చైనా, తుర్కియే చమురు కొంటున్నాయి. యూరప్ దేశాలు కూడా ఇతర రష్యా ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ బిలియన్ల డాలర్లను మాస్కోకు అందిస్తున్నాయి. అలాంటప్పుడు భారత్‌ను వేలెత్తి చూపడం ఎంతవరకు సమంజసం..?” అని థరూర్ ప్రశ్నించారు.
జీఎస్టీ సంస్కరణలకు స్వాగతం : ఇదే సమయంలో, కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో తీసుకువచ్చిన సంస్కరణలను శశి థరూర్ స్వాగతించారు. “నాలుగు వేర్వేరు శ్లాబుల విధానం ప్రజలను గందరగోళానికి గురిచేసింది. దీనిని సరళీకరించి, ఒకే రేటు లేదా రెండు రేట్ల విధానం తీసుకురావాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుత మార్పులు మరింత న్యాయమైన వ్యవస్థకు దారితీస్తాయని, ప్రజలకు ఉపశమనం కలిగిస్తాయని ఆశిస్తున్నాం,” అని ఆయన పేర్కొన్నారు.


