Monday, February 16, 2026
Homeనేషనల్Congress : 'హస్తం'లో మంచు వీడింది.. రాహుల్‌తో థరూర్ భేటీ సక్సెస్!

Congress : ‘హస్తం’లో మంచు వీడింది.. రాహుల్‌తో థరూర్ భేటీ సక్సెస్!

Tharoor Kharge Rahul Meeting : గత కొద్దిరోజులుగా కాంగ్రెస్ పార్టీలో అంతర్లీనంగా రగులుతున్న అసంతృప్తి జ్వాలకు ఎట్టకేలకు తెరపడింది. ‘అవమానం.. అలక.. మౌనం’ అన్నట్లుగా సాగిన ఎపిసోడ్‌కు సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ శుభం కార్డు వేశారు. అగ్రనేత రాహుల్ గాంధీ తీరుపై థరూర్ గుర్రుగా ఉన్నారన్న వార్తల నడుమ.. గురువారం దిల్లీ వేదికగా కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్ సాక్షిగా పార్టీ పెద్దలతో గంటకు పైగా మంతనాలు జరిపిన థరూర్.. బయటకు రాగానే “ఆల్ ఈజ్ వెల్” అంటూ సంకేతాలిచ్చారు. అంతేకాదు, కేరళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన ‘ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం’పైనా కుండబద్దలు కొట్టారు. 

- Advertisement -

ఖర్గే ఛాంబర్‌లో కీలక భేటీ.. తొలగిన సందేహాలు : గురువారం పార్లమెంట్ భవన సముదాయంలోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఛాంబర్‌లో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న సమావేశం జరిగింది. ఈ భేటీలో ఖర్గేతో పాటు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఎంపీ శశి థరూర్ పాల్గొన్నారు. సుమారు గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో ప్రధానంగా కేరళ రాజకీయాలు, ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, పార్టీ అంతర్గత వ్యవహారాలపై కూలంకషంగా చర్చించారు.

భేటీ అనంతరం థరూర్ మీడియాతో మాట్లాడుతూ.. “మా ఇద్దరు అగ్రనేతలతో (ఖర్గే, రాహుల్) జరిపిన చర్చలు అత్యంత నిర్మాణాత్మకంగా, సానుకూలంగా సాగాయి. పార్టీ నాయకత్వంతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. మేమంతా ఒకే కుటుంబం. కలిసే ముందుకెళ్తాం” అని స్పష్టం చేశారు. దీంతో పార్టీలో వర్గపోరు ఉందన్న వార్తలకు చెక్ పడినట్లయింది.

నేను సీఎం రేసులో లేను: థరూర్ స్పష్టీకరణ : త్వరలో జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా థరూర్ బరిలో ఉంటారన్న ఊహాగానాలపైనా ఆయన ఫుల్ క్లారిటీ ఇచ్చారు.  “ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం అనే అంశం అసలు చర్చకే రాలేదు. సీఎం రేసులో ఉండటానికి, అభ్యర్థిగా బరిలో దిగడానికి నాకు ఏమాత్రం ఆసక్తి లేదు” అని తేల్చిచెప్పారు.
ఎంపీగానే కొనసాగుతా: “తిరువనంతపురం ఓటర్లు నాపై నమ్మకం ఉంచారు. పార్లమెంటులో వారి గొంతుకగా నిలవడమే నా ప్రథమ కర్తవ్యం. నా పని నేను చేసుకుపోతాను” అని థరూర్ పేర్కొన్నారు.

అసలు అలక ఎందుకు? – కొచ్చిలో ఏం జరిగింది : వివాదానికి ప్రధాన కారణం జనవరి 19న కొచ్చిలో జరిగిన ‘మహా పంచాయత్’ కార్యక్రమం. స్థానిక సంస్థల విజేతలను సత్కరించే ఈ సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ వేదికపై ఉన్న పలువురు నేతల పేర్లను ప్రస్తావించారు. కానీ, నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన, సీడబ్ల్యూసీ (CWC) సభ్యుడైన శశి థరూర్ పేరును మాత్రం విస్మరించారు. పక్కనే ఉన్నా తనను పట్టించుకోకపోవడం, కేరళ రాష్ట్ర నేతలు తనను వరుసగా పక్కన పెడుతుండటంతో థరూర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆ తర్వాత జరిగిన పార్టీ వ్యూహరచన సమావేశానికి కూడా ఆయన డుమ్మా కొట్టడంతో వ్యవహారం ముదిరింది.

విదేశాంగ విధానంపై రగడ : మరోవైపు, భారత్-పాక్ సంబంధాలు, పహల్గాం దాడి ఘటనలపై థరూర్ చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీలో కలకలం రేపాయి. ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ అధికారిక లైన్‌కు భిన్నంగా ఉన్నాయంటూ సొంత పార్టీ నేతలే విమర్శించారు. అయితే, విదేశాంగ విధానంలో పక్షపాతం ఉండకూడదని, దేశ ప్రయోజనాలే ముఖ్యమని థరూర్ తన వాదనను వినిపించారు. మొత్తానికి తాజా భేటీతో థరూర్ అలక వీడినట్లు కనిపిస్తోంది. శుక్రవారం ఖర్గే నేతృత్వంలో జరగనున్న కేరళ నేతల సమావేశంలో ఎన్నికల వ్యూహాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News