Shocking incident in Moradabad district: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మోరాదాబాద్ జిల్లాలో ఓ దారుణమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మానసిక వ్యాధితో బాధపడుతున్న ఓ 23 ఏళ్ల మహిళ చేసిన ఓ పనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సదరు మహిళ ప్రసవానంతరం తన 15 రోజుల పసికందును నిద్రపోయే ముందు ఫ్రీజర్‌లో పెట్టి మరిచిపోయింది. దీంతో, ఆ పసికందు ఆర్తనాధాలు విన్న సదరు మహిళ తల్లి ఆ పసికందును రక్షించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రసవానంతరం మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ మహిళ తన భర్త, తల్లి, అత్తమామలతో కలిసి మొరాదాబాద్‌లోని జబ్బర్ కాలనీలో నివసిస్తోంది. అయితే, సెప్టెంబర్ 5న పసికందును వంటగదికి తీసుకెళ్లి ఫ్రిజ్‌లో పడుకోబెట్టింది. వెంటనే, ఆమె తన గదికి తిరిగి వచ్చి నిద్రపోయింది. కొద్దిసేపటి తర్వాత, ఆ పసికందు ఏడుపులు విన్న కుటుంబ సభ్యులు వెంటనే అందులో నుంచి బయటకు తీసింది. తదనంతరం వెంటనే ఆ పసికందుని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పసికందుకు ఎలాంటి ప్రమాదం జరగలేదని డాక్టర్లు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. సదరు మహిళ నిర్ణక్ష్యంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం సదరు మహిళ మానసిక వ్యాధిని అర్థం చేసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ప్రసవం తర్వాత తలెత్తే అరుదైన వ్యాధి
అయితే, ఈ ఘటన జరిగిన తర్వాత పసికందు తల్లిని ఆమె కుటుంబ సభ్యులు మానసిక సంరక్షణలో చేర్చారు. అక్కడ వైద్యులు ఆమెకు ప్రసవానంతరం పోస్ట్‌పార్టమ్ సైకోసిస్ ఉన్నట్లుగా నిర్ధారించారు. ఇది ప్రసవం తర్వాత తలెత్తే అరుదైన వ్యాధి అని పేర్కొన్నారు. అయితే, ఇది తీవ్రమైన మానసిక రుగ్మత కాదని, సైకోసిస్ అనేది చాలా అరుదైన వ్యాధి అని స్పష్టం చేశారు. ప్రతి 1,000 ప్రసవాలకు ఒక్కరు లేదా ఇద్దరు మహిళలను ఈ వ్యాధి ప్రభావితం చేస్తుందని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా 20 శాతం మందిలో..
కాగా, అభివృద్ధి చెందుతున్న దేశాలలో దాదాపు 20 శాతం మంది మహిళలు సైకోసిస్ వ్యాధితో బాధపడుతున్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా వేసింది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం భారతదేశంలో ఈ వ్యాధి వ్యాప్తి 22 శాతంగా ఉందని తేలింది. అయినప్పటికీ ఈ వ్యాధిపై అవగాహన చాలా తక్కువగా ఉందని, అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ఈ వ్యాధి ముదిరితే ఆయా మహిళల్లో తమకు లేదా తమ బిడ్డకు హాని కలిగించే ఆలోచనలు, ప్రవర్తనలు రేకెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.


