Fine: ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే చలానా పడుతుందని తెలుసు. కానీ, ఏకంగా రూ. 20 లక్షల 74 వేల చలానా పడితే ఎలా ఉంటుంది? ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో ఓ సామాన్య స్కూటర్ రైడర్‌కు ఇదే చేదు అనుభవం ఎదురైంది. సాంకేతిక లోపం (టెక్నికల్ గ్లిచ్) కారణంగా జారీ అయిన ఈ భారీ జరిమానా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
నవంబర్ 4న గాంధీ కాలనీ చెక్‌పాయింట్ వద్ద జరిగిన ఈ సంఘటనలో, స్కూటర్ నడుపుతున్న అన్మోల్ సింఘాల్ అనే వ్యక్తికి హెల్మెట్ లేకపోవడం, సరైన డ్రైవింగ్ లైసెన్స్ చూపించకపోవడం వల్ల ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. జరిమానా విధించడమే కాకుండా, పోలీసులు నిబంధనల ప్రకారం ఆయన స్కూటర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
అయితే, అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. ఆయన ఫోన్‌కు వచ్చిన మెసేజ్ చూసి అన్మోల్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ మెసేజ్‌లో చలానా మొత్తం రూ. 20,74,000గా ఉంది. లక్షల్లో వచ్చిన ఈ జరిమానా చూసి అన్మోల్ తో పాటు చూసిన వారంతా కంగుతిన్నారు. వెంటనే ఆయన ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది క్షణాల్లో వైరల్ అయ్యింది.
విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు వెంటనే దీనిపై విచారణ చేపట్టారు. ఈ భారీ జరిమానా వెనుక కారణం కేవలం ఒక చిన్న క్లరికల్ పొరపాటు అని తేలింది. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 207 (వాహనం సీజ్ చేయడానికి సంబంధించిన సెక్షన్) కింద కేసు నమోదు చేయాల్సి ఉండగా, చలానా జారీ చేసిన సబ్-ఇన్స్పెక్టర్ పొరపాటున ‘207’ అనే నంబర్‌ను జరిమానా మొత్తానికి తప్పుగా జోడించారు.
దాంతో రూ. 4 వేలు ఉండాల్సిన అసలు చలానా, పొరపాటున ‘207’ నంబర్‌తో కలిసి రూ. 20 లక్షల 74 వేలుగా మారిపోయింది. ఈ లోపాన్ని గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు వెంటనే చలానాను సవరించి, అన్మోల్ సింఘాల్ చెల్లించాల్సిన అసలు జరిమానా రూ. 4 వేలు మాత్రమే అని స్పష్టం చేశారు.
సాంకేతిక పొరపాటుతో ఓ సామాన్యుడు ఎదుర్కొన్న ఈ అనుభవం.. డిజిటల్ చలానా వ్యవస్థలో చిన్న పొరపాట్లు ఎంత పెద్ద గందరగోళానికి దారి తీయగలవో తెలియజేసింది. చివరికి విషయం సద్దుమణగడంతో స్కూటర్ యజమాని ఊపిరి పీల్చుకున్నాడు.


