Shraddha Kapoor injured during the shooting of ‘Eeta’: బాలీవుడ్ ప్రముఖ నటి శ్రద్ధా కపూర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఈతా’ బయోపిక్ సెట్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆమె కాలికి ఫ్రాక్చర్ కావడంతో సినిమా చిత్రీకరణను తాత్కాలికంగా నిలిపివేశారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ నాసిక్‌లో జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ కథనాల ప్రకారం, ఈతా చిత్రంలో ఒక పాటను చిత్రీకరిస్తున్న సమయంలో శ్రద్ధా గాయపడింది. వేగవంతమైన డ్యాన్స్ స్టెప్పులు వేస్తుండగా, ఆమె తన శరీర బరువు మొత్తం ఎడమ కాలిపై వేయడంతో బ్యాలెన్స్ కోల్పోయి కిందపడిపోయారు. నౌవారీ చీర, బరువైన ఆభరణాలు ధరించి డ్యాన్స్ వేయగా.. బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయారు. ఈతా సినిమాలో లీడ్ రోల్‌లో యాక్ట్ చేస్తోంది శ్రద్ధా కపూర్. ఈ ప్రాజెక్టు కోసం శ్రద్ధా 15 కిలోలకు పైగా బరువు పెరిగారు. ప్రమాదం తర్వాత ముంబైకి తిరిగివచ్చిన శ్రద్ధా కొన్ని ఎమోషనల్ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్నారు. అయితే, నొప్పి ఎక్కువ కావడంతో షూటింగ్‌ను అర్థాంతరంగా ఆపేశారు. ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత, రెండు వారాలకు చిత్రీకరణ తిరిగి ప్రారంభమవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. అయితే, ఈ విషయంపై శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో ఇంకా స్పందించలేదు. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ తమాషా కళాకారిణి, ‘తమాషా సామ్రాజ్ఞి’గా పేరొందిన విఠాబాయి నారాయణగావ్కర్ జీవితం ఆధారంగా ఈతా చిత్రం తెరకెక్కుతోంది. ఆమె జానపద నృత్యానికి చేసిన సేవలకు గాను 1957, 1990లలో రాష్ట్రపతి అవార్డులు అందుకున్నారు.
Also Read: https://teluguprabha.net/national-news/popular-singer-arman-sidhu-dies-in-road-accident/

