Shraddha Murder Case: శ్రద్ధా వాకర్ హత్యకేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జీవితకాలం సంతోషంగా కలిసి జీవించొచ్చు అనుకొని, తల్లిదండ్రులనుసైతం ఎదిరించి ప్రియుడితో వచ్చేసిన శ్రద్దా చివరికి ఆ ప్రియుడి చేతిలో అతికిరాతకంగా హత్యకు గురైంది. డేటింగ్ యాప్ ద్వారా 2019లో దగ్గరైన శ్రద్ధ, అఫ్తాబ్‌లు అప్పటి నుంచి సహజీవనం సాగిస్తున్నారు. సంవత్సరం పాటు వారు కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ సహజీవనం చేశారు. శ్రద్ధా తనను పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి చేయడం మొదలు పెట్టిననాటి నుంచి ప్రియుడు ఆఫ్తాబ్ టార్చర్ మొదలైందట. శ్రద్ధా హత్యకేసులో పోలీసులు విచారణ జరుపుతున్నా కొద్దీ నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.
శ్రద్ధా ప్రియుడు ఆఫ్తాబ్ పెట్టే బాధలు భరించలేక 2020 సంవత్సరంలో అఫ్తాబ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిందని పోలీసుల విచారణలో తేలిసింది. ఇద్దరూ కలిసి ఉంటున్న ఫ్లాట్‌లోనే తనను అఫ్తాబ్ కొట్టినట్టు పోలీసులకు శ్రద్ధ లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది. అంతేకాదు.. తనను ఊపిరిఆడకుండాచేసి చంపాలని చూశాడని ఫిర్యాదులో శ్రద్దా తెలిపింది. అతని హింసాత్మక ప్రవర్తన గురించి అతని కుటుంబ సభ్యులకు కూడా తెలుసునని ఆమె పేర్కొన్నట్టు ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. గొడవ తర్వాత అఫ్తాబ్ తల్లిదండ్రులు నచ్చచెప్పడంతో తాము ఇకమీదట పోట్లాడుకోమంటూ స్థానిక పోలీసులకు శ్రద్ధ మరో లిఖితపూర్వక లేఖ సమర్పించిందట. శ్రద్ధా వాకర్ రెండేళ్ల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలోనే అఫ్తాబ్‌తో పోట్లాటలో గాయపడిన తన ఫోటోను తనతో పనిచేస్తున్న కరణ్‌కు వాట్సాప్‌లో షేర్ చేసింది. ఒక వారం తర్వాత పైకి కనిపించని గాయలతో ఆసుపత్రిలో కూడా చేరింది.
పెద్దలు కుదుర్చిన సయోధ్యతో శ్రద్ధా, ఆమె ప్రియుడు ఆఫ్తాబ్ అదే ప్లాట్‌లో మళ్లీ జీవితాన్ని ఆరంభించారు. అప్పటి నుంచి శ్రద్ధాకు ప్రియుడు టార్చర్ చూపేవాడట. పలుసార్లు ఆఫ్తాబ్ గురించి తన స్నేహితుల వద్ద శ్రద్ధా కన్నీరు పెట్టుకుందని తెలుస్తుంది. వారంలో సగంరోజులు చిన్న విషయంలో ఇద్దరు మధ్య వివాదం తలెత్తడం, ఆఫ్తాబ్ పెట్టే చిత్రహింసలు ఎదుర్కోవటం.. ఇలా శ్రద్దాకు నిత్యం నరకప్రాయంగా ఉండేదని ఆమె స్నేహితులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది మేలో ఢిల్లీ మెహ్రౌలిలోని ఫ్లాట్‌లోకి శ్రద్ధ-అఫ్తాబ్ ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఆఫ్తాబ్ శ్రద్ధాను కత్తితో హత్యచేశాడు. అయితే శ్రద్ధానుహత్యచేయాలని ముందే ఆఫ్తాబ్ ప్లాన్ వేసుకొని ఉంటాడని పోలీస్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఆఫ్తాబ్ మాత్రం ఆవేశంలో శ్రద్ధాను హత్యచేసినట్లు పోలీసుల విచారణలో, ఇటీవల కోర్టులో చెప్పాడు. ఆఫ్తాబ్ నుంచి అసలు నిజాలు రాబట్టేందుకు కోర్టు నార్కో టెస్టుకుసైతం అనుమతినిచ్చింది. మొత్తానికి నమ్మివచ్చిన ప్రియురాలిని అతికిరాతకంగా హత్యచేసిన ఆఫ్తాబ్‌ను ఉరితీయాలని దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.