Saturday, November 15, 2025
Homeనేషనల్Racing Sensation: సరికొత్త చరిత్ర లిఖించిన శ్రేయ: భారత్ తొలి మహిళా ఫార్ములా 4 రేసర్‌గా...

Racing Sensation: సరికొత్త చరిత్ర లిఖించిన శ్రేయ: భారత్ తొలి మహిళా ఫార్ములా 4 రేసర్‌గా దూకుడు

India’s first female formula racer : గంటకు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకెళ్లే కార్లు.. మగవారిదే ఆధిపత్యం అనుకునే మోటార్ స్పోర్ట్స్ రంగం.. ఈ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ ఓ 17 ఏళ్ల అమ్మాయి చరిత్ర సృష్టించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణం నుంచి వచ్చి, భారతదేశపు మొట్టమొదటి మహిళా ఫార్ములా 4 రేసర్‌గా నిలిచింది. అసలు ఎవరీ శ్రేయ లోహియా..? అబ్బాయిలకే పరిమితమనుకున్న ఈ క్రీడలోకి ఎలా వచ్చింది..? ఆమె విజయ ప్రస్థానం వెనుక ఉన్నదెవరు..?

- Advertisement -

హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ జిల్లా సుందర్‌నగర్‌కు చెందిన శ్రేయ లోహియా, భారత మోటార్ స్పోర్ట్స్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. పురుషాధిక్య క్రీడగా భావించే ఫార్ములా రేసింగ్‌లో అడుగుపెట్టి, దేశంలోనే తొలి మహిళా ఫార్ములా 4 (F4) రేసర్‌గా రికార్డు సృష్టించింది. అమ్మాయిలు ఏ రంగంలోనైనా రాణించగలరని తన విజయంతో గర్వంగా చాటిచెప్పింది.

తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే : సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లయిన రితేశ్ లోహియా, వందన లోహియాల కుమార్తే శ్రేయ. తన కుమార్తె ఆసక్తిని గమనించిన తండ్రి రితేశ్, ఆమెకు తొమ్మిదేళ్ల వయసులోనే కార్టింగ్ రేసింగ్‌లో (మోటార్ స్పోర్ట్స్‌లో ప్రాథమిక స్థాయి) శిక్షణ ఇప్పించారు. అప్పటి నుంచి శ్రేయ వెనుదిరిగి చూసుకోలేదు. తల్లిదండ్రుల నిరంతర ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదుగుతూ, కార్టింగ్ రేసింగ్‌లో 30కి పైగా పోడియం ఫినిషింగ్‌లు (మొదటి మూడు స్థానాల్లో నిలవడం) సాధించింది.

చారిత్రాత్మక విజయం: 2024లో జరిగిన ప్రతిష్టాత్మక ఇండియన్ ఫార్ములా 4 ఛాంపియన్‌షిప్‌లో ‘హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్’ జట్టు తరఫున శ్రేయ పోటీపడింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడం ద్వారా, భారతదేశపు తొలి మహిళా F4 రేసర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. ఆమె ప్రతిభకు గుర్తింపుగా, ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా (FMSCI) ఆమెను నాలుగుసార్లు సత్కరించడమే కాకుండా, ‘ఔట్‌స్టాండింగ్ విమెన్ ఇన్ మోటార్ స్పోర్ట్స్’ అవార్డును ప్రదానం చేసింది. అంతకుముందు, 2022 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక ‘రాష్ట్రీయ బాల పురస్కారం’ అందుకోవడం ఆమె కెరీర్‌లోనే ఒక మైలురాయి.

చదువులోనూ చురుకే: రేసింగ్ ట్రాక్‌పై ఎంత వేగంగా దూసుకెళ్తుందో, చదువులోనూ శ్రేయ అంతే చురుకుగా ఉంటుంది. ప్రస్తుతం 12వ తరగతి సైన్స్ చదువుతున్న ఆమె, రేసింగ్ శిక్షణ వల్ల కళాశాలకు వెళ్లలేకపోయినా, ఇంట్లోనే చదువుకుంటూ పరీక్షలకు సిద్ధమవుతోంది. “రేసింగ్ నా ప్రాణం. కానీ చదువు కూడా అంతే ముఖ్యం. రెండింటినీ సమన్వయం చేసుకోవడం సవాలుతో కూడుకున్నదే, కానీ ఆ సవాళ్లే నన్ను మరింత బలవంతురాలిని చేస్తాయి,” అని శ్రేయ ధీమాగా చెబుతోంది.

భవిష్యత్ ప్రణాళికలు: శ్రేయ విజయం పట్ల ఆమె తండ్రి రితేశ్ లోహియా ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె మనాలి హిమాలయన్ ర్యాలీ కోసం సిద్ధమవుతోందని, వచ్చే ఏడాది 18 ఏళ్లు నిండిన తర్వాత అధికారికంగా ఆ ర్యాలీలో పాల్గొంటుందని తెలిపారు. రాబోయే 2-3 నెలల్లో ఉన్నతస్థాయి ఫార్ములా రేసింగ్ శిక్షణ కోసం విదేశాలకు కూడా వెళ్లనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఫార్ములా 4 అంటే ఏమిటి : ఫార్ములా వన్ (F1) మోటార్ స్పోర్ట్స్‌లోనే అత్యున్నత స్థాయి. ఇందులో ప్రపంచంలోని అత్యుత్తమ డ్రైవర్లు, అత్యాధునిక సాంకేతికతతో కూడిన కార్లతో గంటకు 370 కి.మీ వేగంతో పోటీపడతారు. ఫార్ములా ఫోర్ (F4) అనేది యువ రేసర్లకు (15-17 ఏళ్ల వయస్సు) ఒక ప్రవేశ స్థాయి పోటీ. ఇందులో కార్ల వేగం గంటకు సుమారు 220 కి.మీ వరకు ఉంటుంది. F4లో రాణించిన వారే భవిష్యత్తులో F1 రేసర్లుగా ఎదుగుతారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad