Shubhanshu Shukla Hair cut In ISS: భారత యువ వ్యోమగామి శుభాన్షు శుక్లా అరుదైన ఘనతను సాధించారు. ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో హెయిర్ కటింగ్ చేయించుకున్న తొలి భారతీయుడిగా చరిత్రలో నిలిచారు. ప్రస్తుతం శుక్లా డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా భూమికి తిరిగి వస్తున్నారు. కొద్ది గంటలలోనే ఆయన భూమిపైకి అడుగుపెట్టనున్నారు. అయితే ఈ వినూత్న అనుభవాన్ని శుక్లాకు అందించినది నికోల్ ఆయర్స్ అనే వ్యోమగామి. అమెరికన్ వైమానిక దళంలో మేజర్‌గా పనిచేస్తున్న నికోల్, ప్రస్తుతం 122 రోజులుగా అంతరిక్షంలో ఉన్నారు. ఆమె ఇటీవలే సుమారు ఆరు గంటల పాటు స్పేస్‌వాక్ చేసిన సంగతి కూడా తెలిసిందే. శుక్లా హెయిర్ కటింగ్ అనంతరం నికోల్ సరదాగా, “ఇంకా భూమికి వెళ్లాక బార్బర్ షాప్ ఓపెన్ చేస్తారా?” అంటూ జోక్ చేశారు. శుక్లా అంతరిక్ష ప్రయాణానికి ముందు, ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్‌లో 30 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్నారు. ఆయన ప్రయాణం పలు మార్లు వాయిదా పడినప్పటికీ, చివరికి నాసా ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేశారు.
అంతరిక్షంలో హైజీనిక్ ప్రక్రియలు ఎలా ఉంటాయి?
ISSలో సాధారణంగా మన భూమిపై ఉండే లగ్జరీలు ఉండవు. షవర్స్, బాత్‌టబ్‌లు, లేదా వేడి నీటి వసతులు అందుబాటులో ఉండవు. వ్యోమగాములు తాము శుభ్రంగా ఉండేందుకు తడి టవల్స్, కొంత నీరు, మరియు సబ్బుతో తమ శరీరాన్ని శుభ్రం చేసుకుంటారు. ఈ విషయాన్ని ఫ్రెంచ్ వ్యోమగామి థామస్ పేస్కెట్ వెల్లడించారు. శుక్లా కూడా ఇదే విధంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించారు. అంతరిక్షానికి వెళ్లే సమయంలో ఆయనకు కొద్దిగా గడ్డం ఉండగా, ప్రస్తుతం పూర్తిగా గడ్డం గీయించుకొని కనిపిస్తున్నారు. శుభాన్షు శుక్లా అనుభవం.. ఒక భారతీయుడు అంతరిక్షంలో హెయిర్ కటింగ్ చేయించుకోవడం, యువతలో స్పేస్ రంగంపై ఆసక్తిని పెంచే అవకాశం కల్పిస్తోంది. ఇది కేవలం వ్యక్తిగత ఘనత మాత్రమే కాదు, భారత అంతరిక్ష యాత్రలో మరో మైలురాయి కూడా.


