Saturday, November 15, 2025
Homeనేషనల్Shubhanshu Shukla: శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్రకు ముహుర్తం ఖరారు

Shubhanshu Shukla: శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్రకు ముహుర్తం ఖరారు

భాతర అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISRO) మరో అరుదైన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. స్పేస్ ఎక్స్ డ్రాగన్ యాక్సియం-4 వ్యోమనౌక ద్వారా ఈ ప్రయోగం చేపట్టనుంది. ఇందుకు సంబంధించిన కొత్త తేదీని తాజాగా ప్రకటించింది. వాస్తవంగా మే 29నే ఈ ప్రయోగం జరగాల్సి ఉంది. అయితే సాంకేతిక సమస్యల కారణంగా ప్రయోగం జూన్ 8వ తేదీకి వాయిదా పడింది. అనంతరం జూన్‌ 11కు వాయిదా పడింది. యాక్సియం-4 మిషన్‌కు సంబంధించిన ఫాల్కన్‌-9 రాకెట్‌ తనిఖీల్లో లిక్విడ్ ఆక్సిజన్ లీక్ అవుతున్నట్లు గుర్తించారు. దీంతో జూన్‌ 11న జరగాల్సిన ఈ ప్రయోగం మళ్లీ వాయిదా వేశారు.

లీకేజ్‌కు సంబంధించిన సమస్యను పూర్తి చేయడంతో కొత్త తేదీని ప్రకటించారు. జూన్ 19న అంతరిక్షంలోకి ఈ యాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. అమెరికాలో నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. భారత్‌, పోలండ్‌, హంగేరీకి చెందిన నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా వెళ్లనున్నారు. అక్కడే 14 రోజుల పాటు ఉండనున్నారు. ఈ మిషన్‌కు భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) పైలట్‌గా వ్యవహరించనుండటం విశేషం. దీంతో ప్రైవేట్‌ రోదసి యాత్ర ద్వారా అంతర్జాతీయ అంతరిక్షకేంద్రానికి వెళ్లిన తొలి భారత వ్యోమగామిగా శుభాన్షు చరిత్ర సృష్టించనున్నారు.

ఇప్పటికే భారత్‌కు చెందిన ప్రముఖ వ్యోమగామి రాకేశ్‌ శర్మ 1984లో రష్యా సహకారంతో రోదసి యాత్ర చేపట్టిన విషయం విధితమే. రాకేశ్‌ శర్మ రోదసి యాత్ర చేపట్టిన నాలుగు దశాబ్దాల తర్వాత శుభాన్షు ఈ గౌరవాన్ని దక్కించుకోనున్నారు. శుభాన్షు శుక్లాకు నాసా మాజీ ఆస్ట్రోనాట్ డాక్టర్ విట్సన్ సలహాలు, సూచనలు అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad