Karnataka CM: కర్ణాటక ముఖ్యమంత్రి(Karnataka CM) సిద్ధరామయ్య గురువారం రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలను తోసిపుచ్చారు. నేను ఎక్కడికీ వెళ్లను అని, మరో ఐదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని పునరుద్ధాటించారు. అత్యున్నత పదవికి ఖాళీ లేదని వ్యాఖ్యానించారు. సిద్ధరామయ్య (Siddaramaiah)మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థానంపై ఎటువంటి చర్చ జరగలేదన్నారు. ఇదే తన సమాధానమని చెప్పారు. ముఖ్యమంత్రి పదవికి ఖాళీ లేదని డీకే శివకుమార్ (DK Shivakumar) స్వయంగా చెప్పారన్నారు. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా, తామిద్దరం పాటిస్తామని అన్నారు. పార్టీ సీనియర్ నాయకత్వాన్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నానని పేర్కొననారు. ఈ రోజు రాహుల్ గాంధీని కలవడానికి నేను అపాయింట్‌మెంట్ కోరానని తెలిపారు. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు, పార్టీ హైకమాండ్ నుంచి అసంతృప్తి ఆరోపణలపై పెరుగుతున్న చర్చల మధ్య ఆయన ఈ ప్రకటన చేశారు.
అయితే 2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత అత్యున్నత పదవికి బలమైన పోటీదారుగా విస్తృతంగా పరిగణించబడిన ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆయన మధ్య అధికార భాగస్వామ్య ఒప్పందం గురించి నిరంతర పుకార్ల మధ్య ఆయన వ్యాఖ్యలు చేశారు. కాగా నిన్న డీకే శివకుమార్ కూడా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ లేదా నాయకత్వంలో మార్పు ఉంటుందన్న వార్తలను ఖండించిన విషయం తెలిసిందే. “కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలో లేదు. వివిధ రాష్ట్ర సమస్యలపై చర్చించడానికి నేను, సీఎం సిద్ధరామయ్య కేంద్ర మంత్రులను కలుస్తున్నాం” అని శివకుమార్ విలేకర్లకు వెల్లడించిన సంగతి తెలిసిందే.
కాగా ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు బహిరంగంగానే సీఎం మార్పును కోరుకుంటూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు డీకే శివకుమార్‌కే ఉందంటూ ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు మీడియా ముందుకొచ్చి చెబుతున్నారు. దీంతో కన్నడ రాజకీయాలు ఆసక్తిగా మారాయి.
ALSO READ: https://teluguprabha.net/telangana-news/kcr-joined-in-yashoda-hospital/
కర్ణాటక రాజకీయాల్లో నాయకత్వ మార్పు జరగబోతోందంటూ వస్తున్న ఊహాగానాలకు కాంగ్రెస్ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సైతం తెరదించారు. కర్ణాటక ముఖ్యమంత్రి మారబోతున్నారన్న ప్రచారాన్ని ఖండిస్తూ, తాను అలాంటి మార్పులకు ఆశపడటం లేదని ఇటీవల మీడియాతో స్పష్టం చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్‌ను సీఎం పదవిలోకి తీసుకురాబోతున్నారంటూ కొన్ని వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అఖిల భారత వ్యవహారాల ఇన్‌చార్జి రణ్‌దీప్ సుర్జేవాలా బెంగళూరులో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కావడంతో, ఆ ఊహాగానాలకు మరింత ప్రచారం చేకూరింది.
ఈ నేపథ్యంలో ఈ వార్తలపై స్పందించిన డీకే శివకుమార్, ప్రస్తుతం కర్ణాటకలో సీఎం మార్పు అనేది ఎజెండాలో లేదని, అసలు ఆలోచన కూడా లేదన్నారు. “నాకు సీఎం పదవి కావాలని నేను ఎవరినీ ఒత్తిడి చేయడం లేదు. నాకు ఎమ్మెల్యే మద్దతు అవసరమూ లేదు. పార్టీలో ఏ మార్పులు జరగవు” అని ఆయన తేల్చిచెప్పారు. రణ్‌దీప్ సుర్జేవాలా ఎమ్మెల్యేలతో సమావేశమైన అంశంపై కూడా డీకే స్పందించారు. “ఆ సమావేశం రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల ప్రణాళికలపై చర్చించేందుకు మాత్రమే జరిగింది. ప్రభుత్వం మార్పు గురించి మాట్లాడలేదని,” ఆయన స్పష్టం చేశారు. నాయకత్వ మార్పుపై నిరాధార ప్రచారాలు చేయడం మానుకోవాలని డీకే శివకుమార్ తన పార్టీ ఎమ్మెల్యేలకు హితవు పలికారు. “ఇలాంటి విషయాలు మళ్లీ ప్రస్తావించినట్లయితే, ఆ వ్యక్తులపై పార్టీ కఠినంగా స్పందించాల్సి వస్తుంది” అని ఆయన హెచ్చరించిన సంగతి తెలిసిందే.


