Homeనేషనల్Theft : ముంబయి సిద్ధివినాయక ఆలయం విరాళాల చోరీ.. ఏటా రూ.18 కోట్లు పక్కదారి పట్టాయన్న...

Theft : ముంబయి సిద్ధివినాయక ఆలయం విరాళాల చోరీ.. ఏటా రూ.18 కోట్లు పక్కదారి పట్టాయన్న రాజ్ ఠాక్రే

Siddhivinayak Temple Donation Theft : భక్తులు అత్యంత పవిత్రంగా కొలిచే దైవ సన్నిధానాల్లోనూ అవినీతి అపవిత్ర నీడలు అల్లుకుంటున్నాయా? కోట్లది రూపాయల విరాళాలు దేవుడి హుండీకి చేరకముందే అక్రమార్కుల జేబుల్లోకి మళ్లుతున్నాయా? దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ముంబయిలోని సిద్ధివినాయక ఆలయంలో చోటుచేసుకున్నట్లు చెబుతున్న ఒక నమ్మశక్యం కాని చోరీ ఉదంతం ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఏకంగా ఏటా రూ.18 కోట్ల రూపాయల విరాళాల సొమ్ము పక్కదారి పడుతోందని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) అధినేత రాజ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు నివ్వెరపరుస్తున్నాయి. 

రాజ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు – ఆలయాల్లోనూ అక్రమాల పర్వం? : శనివారం ముంబయిలో జరిగిన మహారాష్ట్ర నవనిర్మాణ్ విద్యార్థి సేన (MNVS) సమావేశంలో రాజ్ ఠాక్రే పాల్గొని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల ‘నీట్’ (NEET) పరీక్షల్లో జరిగిన అక్రమాలకు నిరసనగా ఆందోళన బాట పట్టిన యువతను సత్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు.

- Advertisement -

“ప్రస్తుతం దేశంలో భక్తుల నమ్మకాలతో వ్యాపారం జరుగుతోంది. కష్టాల్లో ఉన్న యువత, సామాన్యులు మనశ్శాంతి కోసం దేవాలయాలకు వెళ్తుంటే, అక్కడ కూడా కంచే చేను మేసినట్లు అవినీతి రాజ్యం ఏలుతోంది. పవిత్రమైన ఆలయాలకు కూడా రక్షణ లేకుండా పోయింది” అని రాజ్ ఠాక్రే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబయి సిద్ధివినాయక ఆలయంతో పాటు అయోధ్య రామ్ మందిరంలోనూ దాదాపు రూ.1,400 కోట్ల మేర అవినీతి, చోరీ జరిగాయని ఆరోపిస్తూ, ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.

ట్రస్టీల లేఖతో భోగట్టా బహిర్గతం : తన ఆరోపణలు కేవలం గాలిమాటలు కావని నిరూపించేందుకు రాజ్ ఠాక్రే ఒక ప్రధాన ఆధారాన్ని బహిరంగపరిచారు. సిద్ధివినాయక ఆలయానికి చెందిన ఎనిమిది మంది ట్రస్టీలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందేకు రాసిన లేఖను ఆయన చదివి వినిపించారు. ఆలయంలో పనిచేసే కొందరు ఉద్యోగులు క్రమం తప్పకుండా హుండీలోని కానుకలు, నగదును దొంగిలిస్తున్నట్లు ట్రస్టీల నిఘాలో పట్టుబడ్డారని తెలిపారు. చోరీ వ్యవహారం బయటపడకముందు ఆలయానికి వారానికి రూ.50 లక్షల కంటే తక్కువ విరాళాలు వచ్చేవని, దొంగతనాన్ని అడ్డుకున్న తర్వాత వారపు విరాళాల బకాయి ఒక్కసారిగా రూ.1.5 కోట్లకు పెరిగిందని రాజ్ ఠాక్రే పేర్కొన్నారు. అంటే వారానికి దాదాపు రూ.1 కోటి చొప్పున, ఏడాదికి రూ.18 కోట్ల మేర భక్తుల కానుకలు అక్రమార్కుల పాలుయ్యాయని ఆయన స్పష్టం చేశారు.

దేశంపై ప్రేమా? దుబాయ్‌లో నివాసమా? – నటులపై విమర్శలు : ఇదే వేదికగా ‘జెన్ జీ’ (Gen Z) తరం చైతన్యాన్ని ప్రశంసించిన రాజ్ ఠాక్రే, కొందరు ప్రముఖ బాలీవుడ్ నటుల వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. వివేక్ ఒబెరాయ్, ఆర్. మాధవన్ వంటి నటుల పేర్లను ప్రస్తావిస్తూ, “భారత్‌లో గొప్ప అభివృద్ధి జరుగుతోందని, ప్రధాని నాయకత్వం అద్భుతమని ప్రకటనలు ఇచ్చేవారు తమ కుటుంబాలతో దుబాయ్‌లో ఎందుకు నివసిస్తున్నారు?” అని నిలదీశారు. భారతదేశంలో సినిమాలు తీసి, ఇక్కడ సంపాదించిన డబ్బుతో మళ్లీ విదేశాలకు వెళ్ళిపోతూ ఇక్కడ అంతా బాగుందని కితాబులు ఇవ్వడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.వేలాది మంది వ్యాపారవేత్తలు, నటులు శాశ్వతంగా విదేశాల్లో స్థిరపడుతూ దేశాభివృద్ధి గురించి మాట్లాడటం వారి ద్వంద్వ విధానానికి నిదర్శనమని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News