Saturday, November 15, 2025
Homeనేషనల్Sikkim Rains: కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి.. వరదలో రెస్క్యూ వీడియో వైరల్‌

Sikkim Rains: కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి.. వరదలో రెస్క్యూ వీడియో వైరల్‌

Landslide Rescue Sikkim: సిక్కింలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందగా, ముగ్గురు గల్లంతైనట్లు తెలుస్తోంది. పశ్చిమ సిక్కింలోని యాంగ్‌తాంగ్‌ నియోజకవర్గం ఎగువ రింబిలో కొండచరియలు విరిగిపడి శిథిలాలు, రాళ్లు హ్యూమ్‌ నదిలోకి పడిపోవడంతో నది ఉప్పొంగుతోంది. 

- Advertisement -

జనజీవనం అస్తవ్యస్తం

ఈ ఏడాది భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వరుణుడి ధాటికి ఇళ్లు మునిగిపోవడంతో పాటు వాహనాలు, మనుషులు కొట్టుకుపోయిన సందర్భాలు ఆందోళన కలిగించాయి. ఇక కొండచరియల ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవనగతి అస్తవ్యస్తంగా మారింది. శుక్రవారం పశ్చిమ సిక్కింలో కురిసిన వర్షానికి పర్వతాల్లో పగుళ్లు రావడంతో కొండచరియలు విరిగి పడి నలుగురు మరణించారు. ముగ్గురు గల్లంతైనట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. 

రెస్క్యూ ఆపరేషన్‌

వరద నీటితో ఉప్పొంగుతున్న హ్యూమ్‌ నదిపై చెట్ల దుంగలతో తాత్కాలిక వంతెనను నిర్మించి ఆ వంతెన ద్వారా స్థానికులను పోలీసులు, ఎస్‌ఎస్‌బీ జవాన్లు రక్షిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించి వరద నీటిలో కొట్టుకుపోతున్న ఇద్దరిని తాళ్లతో రక్షిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా ఓ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది.

అతి భారీ వర్షాలు.. ఆరెంజ్‌ అలర్ట్‌

గత రెండు రోజులుగా సిక్కింలో భారీ వర్షాలు కురుస్తుండటంతో హ్యూమ్‌ నది ప్రవాహానికి సమీపంలోని ఇళ్లు కొట్టుకుపోయాయి. కాగా, ఈ నెల 17 వరకు ఆ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఉరుములు, పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక హ్యూమ్ నదితో పాటు, ఇతర నదులు కూడా భారీ వర్షాల కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో.. పర్వతాల్లో పరిస్థితి అధ్వానంగా ఉంది. 

కాగా, వరదలు భారీగా పెరగడంతో మారుమూల ప్రాంతాలకు సహాయకచర్యలను అందించడం కష్టతరంగా మారిందని అధికారులు తెలిపారు. అరుణాచల్‌ప్రదేశ్‌, అస్సాం, మణిపూర్‌, త్రిపుర, మిజోరాం, నాగాలాండ్‌, మేఘాలయలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక పశ్చిమబెంగాల్‌, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. జమ్మూకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad