భారత్-పాకిస్థాన్‌ల మధ్య యుద్దం వాతావరణం నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలను భారత ఆర్మీ అప్రమత్తం చేసింది. ఆయా రాష్ట్రాలపై పాకిస్థాన్ నుంచి దాడుల ముప్పు పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పంజాబ్‌లోని చండీగఢ్‌లో(Chandigarh) ఎయిర్ సైరన్ల(Air Sirens) మోత మోగించారు. పాక్ నుంచి దాడులు జరిగే అవకాశం ఉందని.. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని హెచ్చరించారు. బాల్కనీల్లోకి కూడా రావొద్దని సూచించారు. మరోవైపు జమ్మూలోనూ సైరన్లు మోగాయి.
అటు రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఓ హోటల్ ప్రాంగణంలో పాక్ డ్రోన్ శకలాలు లభ్యమయ్యాయి. తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. బీఎస్‌ఎఫ్ క్యాంప్‌ను లక్ష్య్ంగా చేసుకొని డ్రోన్‌ను పంపగా.. భద్రతా బలగాలు కూల్చేశాయి. ఇక సరిహద్దు జిల్లాల్లో పాక్ నుంచి వస్తోన్న డ్రోన్లను భారత బలగాలు సమర్థంగా కూల్చేస్తున్నాయి. కుప్వారా, యూరీలలో పాక్ సైనికులు తీవ్ర స్థాయిలో కాల్పులకు పాల్పడుతున్నారు. భారత సైన్యం వారికీ ధీటుగా జవాబిస్తోంది.