Septic tank: ఒడిశాలోని కాళహండి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగి ఊపిరాడక ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరిని రక్షించబోయి మరొకరు.. ఇలా ఆరుగురు మృత్యువాత పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అసలేం జరిగిందంటే..?: పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాళహండి జిల్లాలోని ఒక గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సెప్టిక్ ట్యాంక్ సెంటరింగ్‌ను తొలగించేందుకు ఓ మేస్త్రి మొదట లోపలికి దిగాడు. అయితే ట్యాంక్ లోపల పేరుకుపోయిన విషవాయువుల కారణంగా అతను ఊపిరాడక అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. దీంతో లోపల ఉన్న మేస్త్రిని కాపాడాలనే ఆరాటంతో ఒకరి తర్వాత ఒకరుగా.. మరో ఐదుగురు ట్యాంక్‌లోకి దిగారు. కానీ లోపల ఆక్సిజన్ లేకపోవడంతో ఆ ఐదుగురు సైతం ఊపిరాడక పడిపోయారు.
Also read-Maharashtra: లోయలో పడిన కారు.. 8 మంది మృతి
ఆసుపత్రికి తరలించేసరికే: విషయం తెలుసుకున్న గ్రామస్థులు వెంటనే అప్రమత్తమై.. ఆరుగురిని ట్యాంక్ వెలుపలికి తీసుకొచ్చారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంకుల్లోకి ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా దిగడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు ఒకేసారి మరణించడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

