ఇటీవల కాలంలో రక్త బంధాలు గుండె కదిలే ప్రేమకు కాకుండా, లాభనష్టాల లెక్కలకు పరిమితమవుతున్నాయి. తల్లిని కన్న కొడుకే ఆమె బంగారం కోసం శవంపై రాజకీయం ఆడే స్థాయికి దిగజారుతున్నాడు. ప్రేమ, గౌరవం కన్నా ఆస్తి ముఖ్యం అయిపోయే సంఘటనలు పెరుగుతున్నాయి. తల్లి అనే పవిత్ర బంధాన్ని కూడా లాభనష్టాల కోణంలో చూసే ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది.
రాజస్థాన్‌లోని ఓ కొడుకు చేసిన పని అందరినీ కలచివేసింది. తల్లిని మోసి పెట్టిన తానేమిటో తేల్చాలన్నంతగా… ఆమె చివరి యాత్రను అడ్డుకోవడమే కాదు… అంత్యక్రియలు జరగకుండా అడ్డుకున్నారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలోని విరాట్‌నగర్ ప్రాంతంలో మే 3న చోటుచేసుకుంది. లీలా కా బాస్ గ్రామానికి చెందిన భూరి దేవి (వయస్సు 80) అదే రోజున మరణించారు.
ఆమెకు ఏడుగురు కుమారులు ఉన్నారు. వారిలో ఆరుగురు గ్రామంలో కలిసి ఉండగా, ఐదవ కుమారుడు ఓంప్రకాష్ వేరుగా నివసిస్తున్నాడు. ఇతనికి తన అన్నదమ్ములతో ఆస్తి వివాదం ఉంది. అయితే తల్లి మృతి అనంతరం పెద్ద కుమారుడు చితి ఏర్పాట్లు చూసుకుంటుండగా, కుటుంబ సభ్యులు ఆమెకి చివరి సంస్కారాలను నిర్వహించేందుకు శ్మశానానికి వెళ్లారు. అంత్యక్రియల ఊరేగింపు ప్రారంభమై శ్మశానవాటికకు చేరుకుంది.
అక్కడికి వచ్చిన ఓంప్రకాష్ కూడా.. మొదట సహకరించినట్లు కనిపించినా.. ఆ తర్వాత మాత్రం చితిపై పడుకొని అంతిమ సంస్కారాలు అడ్డుకున్నాడు. తన తల్లి వెండి గాజులు, బంగారు ఆభరణాలు తనకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ… చితిపై పడుకున్నాడు. తాను ఆభరణాలు పొందేదాకా తల్లిని దహనం చేయనివ్వనని మొండిగా ప్రవర్తించాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎంత సమాధానంగా నచ్చజెప్పినా వినిపించుకోలేదు. దాదాపు రెండు గంటల పాటు తల్లికి అగ్ని సంస్కారం జరగకుండా అడ్డుపడ్డాడు. చివరికి ఆభరణాలు అతనికి అప్పగించాకే అంత్యక్రియలు జరిపేందుకు ఒప్పుకున్నాడు.
ఈ ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో.. నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఓ తల్లి దేహంపై ఇంత అనాచారం చేయడం ఏంటంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


