Homeనేషనల్Autobiography : వ్యక్తిగత విషాదాల నుంచి రాజకీయ శిఖరాల దాకా.. ఆత్మకథ రూపంలో సోనియా గాంధీ...

Autobiography : వ్యక్తిగత విషాదాల నుంచి రాజకీయ శిఖరాల దాకా.. ఆత్మకథ రూపంలో సోనియా గాంధీ జీవన ప్రస్థానం!

Sonia Gandhi Autobiography Belonging  : కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ తన జీవిత ప్రస్థానాన్ని ఆత్మకథ రూపంలో ప్రజల ముందుకు తీసుకురానున్నారు. నెహ్రూ – గాంధీ కుటుంబంతో ముడిపడిన తన జీవితం, ఎదుర్కొన్న వ్యక్తిగత విషాదాలు, భారత రాజకీయాల్లో కీలక పరిణామాలు, ప్రధానమంత్రి పదవిని తిరస్కరించడం వెనుక ఉన్న పరిస్థితులను ఈ పుస్తకంలో ఆమె వివరించారు. ప్రముఖ అంతర్జాతీయ ప్రచురణ సంస్థ ఆల్ఫ్రెడ్‌ ఎ. నాఫ్‌ ప్రచురిస్తున్న ఈ పుస్తకానికి ‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’ అనే పేరు పెట్టారు. నవంబర్‌ 10న ప్రపంచవ్యాప్తంగా పుస్తకం విడుదల కానుంది. ఇటలీలోని చిన్న పట్టణంలో సాగిన బాల్యం నుంచి బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్‌లో చదువుకుంటున్న సమయంలో రాజీవ్‌ గాంధీతో పరిచయం, అనంతరం ఇందిరా గాంధీ కోడలిగా భారతదేశంలో అడుగుపెట్టిన అనుభవాలను సోనియా గాంధీ ఆత్మకథలో పొందుపరిచారు. నెహ్రూ–గాంధీ కుటుంబంలో తన అనుభవాలు, కుటుంబ సభ్యులతో అనుబంధం, వారి వ్యక్తిగత కోణాలను పాఠకులతో పంచుకున్నారు. 1984లో ఇందిరా గాంధీ హత్య, ఆ తర్వాత ప్రధాని అయిన రాజీవ్‌ గాంధీ 1991లో హత్యకు గురికావడం తన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయని సోనియా గాంధీ పేర్కొన్నారు. వ్యక్తిగత గోప్యతను ఇష్టపడే తాను వరుస కుటుంబ విషాదాల నేపథ్యంలో అనివార్యంగా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని వివరించారు.

- Advertisement -

ప్రధాని పదవిని ఎందుకు వద్దన్నారు? : కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా సుదీర్ఘకాలం పనిచేసిన సోనియా గాంధీ, ప్రధానమంత్రి పదవిని తిరస్కరించిన సందర్భం కూడా పుస్తకంలో కీలకంగా ఉండనుంది. అధికారం అందుబాటులోకి వచ్చిన సమయంలో పదవిని స్వీకరించకపోవడానికి దారితీసిన రాజకీయ, వ్యక్తిగత పరిస్థితులను ఆమె తనదైన కోణంలో వివరించినట్లు ప్రచురణ సంస్థ తెలిపింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ చేతిలో కాంగ్రెస్‌ అధికారాన్ని కోల్పోయే వరకు చోటుచేసుకున్న పలు రాజకీయ పరిణామాలపై కూడా సోనియా గాంధీ తన అభిప్రాయాలను వెల్లడించారు. దాదాపు ఆరు దశాబ్దాలుగా తాను ప్రత్యక్షంగా చూసిన సామాజిక, రాజకీయ మార్పులను భారతదేశం పట్ల తన దృక్పథంతో పాఠకులకు అందించనున్నట్లు తెలిపారు. తన జీవితాన్ని అక్షరబద్ధం చేయడం అంత సులభం కాదని సోనియా గాంధీ పేర్కొన్నారు.

ఎన్నో ఏళ్లుగా మనసులో దాచుకున్న భావాలు, జ్ఞాపకాలను బహిర్గతం చేయడానికి ఎంతో ధైర్యం అవసరమైందన్నారు. రాజకీయాల నుంచి క్రమంగా తప్పుకుంటున్న సమయంలో వెనక్కి తిరిగి చూసుకుంటే తన జీవిత ప్రయాణాన్ని నడిపించిన ప్రధాన సూత్రాలు ‘ప్రేమ, విశ్వాసం’ అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం నెహ్రూ – గాంధీ కుటుంబం జాతీయ రాజకీయాల్లో కొనసాగుతోంది. సోనియా గాంధీ కుమారుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా లోక్‌సభ సభ్యులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ ఆత్మకథ విడుదలపై జాతీయ, అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News