కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాల్లో సోనియా గాంధీ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంటోంది. రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్టు ఆమె చెప్పకనే చెప్పారు. భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ సంతోషంగా ముగిసిందని సోనియా తన ప్రసంగంలో పేర్కొనటమే ఇందుకు కారణం. కాంగ్రెస్ పార్టీకి భారత్ జోడో యాత్ర పెద్ద టర్నింగ్ పాయింట్ అని ఆమె రాహుల్ పాదయాత్రను అభివర్ణించారు. 15,000 మంది కాంగ్రెస్ ప్రతినిధులు హాజరైన కీలక ప్లీనరీలో ఆమె ప్రసంగం ఇప్పుడు కాంగ్రెస్ నేతలందరినీ ఆలోచనలో పడేస్తోంది. ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో మూడురోజులపాటు సాగుతున్న కాంగ్రెస్ ప్లీనరీలో మేధోమధనం సాగుతుండగా, పార్టీకి కొత్త దిశా నిర్దేశం చేసేలా, పార్టీని నడపటంలో కొత్త అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పూర్తిగా స్వేచ్ఛా, స్వతంత్రాలు ఇచ్చినట్టు గాంధీ కుటుంబం స్పష్టమైన సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.
76 ఏళ్ల సోనియా గాంధీ రానున్న లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ ఉత్తర్ ప్రదేశ్ నుంచి పోటీ చేస్తారా అన్నది పజిల్ గా మారింది. ప్రస్తుత సమయాన్ని చాలా చాలెంజింగ్ సమయంగా పేర్కొన్న సోనియా, బీజేపీ-ఆర్ఎస్ఎస్ పాలనలో అన్ని వ్యవస్థలనూ వారి కబంద హస్తాల్లోకి తీసుకున్నట్టు ఆరోపించారు.