South Asia political crisis : మన చుట్టూ అగ్నిపర్వతం బద్దలవుతోంది. అది నిశ్శబ్దంగా, అకస్మాత్తుగా వచ్చిన విస్ఫోటనం కాదు. దశాబ్దాలుగా భూగర్భంలో పేరుకుపోయిన అణచివేత, అసమానత, అధికార మదం అనే లావా, ఇప్పుడు ఒక్కో దేశంలో ఒక్కో రూపంలో బయటకు చిమ్ముతోంది. మొన్న శ్రీలంకలో అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన ఆగ్రహ జ్వాలలు చూశాం. నిన్న బంగ్లాదేశ్ వీధులను రక్తసిక్తం చేసిన విద్యార్థుల తిరుగుబాటును గమనించాం. నేడు, హిమాలయాల నీడలో ప్రశాంతంగా కనిపించే నేపాల్‌లో, కేవలం ఒక సోషల్ మీడియా నిషేధపు నిప్పురవ్వ రాజేసిన దావానలం ఏకంగా ప్రభుత్వాన్నే బూడిద చేసింది.
ఇవి వేర్వేరు దేశాల కథలు కావు. ఒకే రోగంతో బాధపడుతున్న మూడు శరీరాల వేదనాభరితమైన ఆర్తనాదాలు. ఆర్థిక అగాధం, ప్రజాస్వామ్య హననం, సామాజిక న్యాయ తిరస్కరణ అనే విషత్రయం కలిపిన మందును దశాబ్దాలుగా ప్రజల చేత తాగించిన పాలకులు, ఇప్పుడు ఆ ప్రజల తిరుగుబాటు అనే ప్రచండ తుఫానులో కొట్టుకుపోతున్నారు. ఈ రాజకీయ భూకంపాన్ని చూస్తూ, ఈ ప్రాంతానికి పెద్దన్నగా, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారతదేశం, “It is their internal matter” అని కళ్లు మూసుకోగలదా…? పొరుగున కాలుతున్న ఇంటి మంటలు మన ఇంటి చూరును తాకవని ధీమాగా ఉండగలదా…? అసాధ్యం. ఈ సంక్షోభాలు మనకు కేవలం వార్తా శీర్షికలు కావు; అవి మన భవిష్యత్తుకు హెచ్చరిక ఘంటికలు. రాజ్యం హింసాయుత స్వభావం గురించి బాలగోపాల్ చేసిన విశ్లేషణ, రాజ్యాంగ నైతికత గురించి అంబేడ్కర్ చేసిన హెచ్చరికల వెలుగులో ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే…
శ్రీలంక: ఆర్థిక అగాధం – కుటుంబ కౌగిలి : శ్రీలంక పతనం ఒక స్పష్టమైన హెచ్చరిక. అది కుటుంబ పాలన, అహేతుక ఆర్థిక విధానాలు, మెజారిటీ జాతీయవాదం అనే మూడు పాపల ఫలితం. రాజపక్స కుటుంబం దేశాన్ని తమ జాగీరుగా మార్చుకుంది. చైనా అప్పులతో అనవసరమైన ఆర్భాటపు ప్రాజెక్టులు కట్టి, పన్నులు తగ్గించి ఖజానాను ఖాళీ చేసి, రాత్రికి రాత్రే సేంద్రియ వ్యవసాయం అంటూ రైతుల నడ్డి విరిచింది. సింహళ-బౌద్ధ జాతీయవాదాన్ని రెచ్చగొట్టి, తమిళ, ముస్లిం మైనారిటీలను అణచివేసి, మెజారిటీ ప్రజల మద్దతుతో అధికారంలో కొనసాగింది. కానీ, ఆకలికి కులం, మతం ఉండవన్న సత్యం ఆలస్యంగానైనా రుజువైంది. కడుపు మండిన సింహళ ప్రజలే వారిని సింహాసనం నుంచి లాగి పడేశారు.
బంగ్లాదేశ్: అభివృద్ధి ముసుగులో ప్రజాస్వామ్య హననం : బంగ్లాదేశ్ కథ కొంచెం భిన్నమైనది. ఇక్కడ ఆర్థిక వ్యవస్థ కాగితంపై పటిష్ఠంగానే కనిపించింది. కానీ ఆ అభివృద్ధి, ప్రజాస్వామ్యపు సమాధిపై కట్టిన సౌధం. షేక్ హసీనా ప్రభుత్వం ప్రతిపక్షాన్ని నిర్మూలించింది. “డిజిటల్ సెక్యూరిటీ యాక్ట్” వంటి క్రూరమైన చట్టాలతో విమర్శించే ప్రతి గొంతునూ నొక్కేసింది. ఎందరో కార్యకర్తలు “enforced disappearances”కు గురయ్యారు. ఈ అభివృద్ధి ఫలాలు కొద్దిమందికే చేరాయి. అసమానతలు పెరిగాయి. ప్రతిపక్షమనేదే లేకపోవడంతో, ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకున్నప్పుడు, దానిని నడిపించే రాజకీయ శక్తి లేకుండా పోయింది. అందుకే విద్యార్థులు, యువత ఉద్యమానికి ఊపిరిపోశారు.
నేపాల్: హిమాలయ ప్రకంపన – సాంకేతిక తిరుగుబాటు : నేపాల్ సంక్షోభం ఈ శతాబ్దపు నూతన రాజకీయ నమూనా. ఇది “జెన్-జెడ్” యువత శక్తిని, వారి ఆకాంక్షలను, వారి ఆగ్రహాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది.
మూల కారణాలు: నేపాల్ దశాబ్దాలుగా రాజకీయ అస్థిరత అనే దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతోంది. నిరంతరం ప్రభుత్వాలు మారడం, నేతల మధ్య కుమ్ములాటలు, వ్యవస్థీకృతమైన అవినీతి ప్రజలను పూర్తిగా విసిగించాయి. పాత తరం రాజకీయ నాయకులపై యువతకు విశ్వాసం పూర్తిగా సన్నగిల్లింది.
నిప్పురవ్వ: ఈ నేపథ్యంలో, ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఇది కేవలం సామజిక మాద్యమాల నిషేధం కాదు. అది యువత గొంతును, వారి భావ ప్రకటనా స్వేచ్ఛను, వారి ప్రపంచాన్ని అణచివేసే ప్రయత్నం. వారి అస్తిత్వంపై జరిగిన దాడిగా వారు భావించారు. “A silenced generation finds its voice in the streets.”
నూతన నాయకత్వం: ఈ ఉద్యమం విశిష్టత ఏమిటంటే, అది కేవలం ప్రభుత్వాన్ని పడగొట్టడంతో ఆగలేదు. పాత రాజకీయ నాయకులందరినీ తిరస్కరించి, దేశంలో విద్యుత్ కోతలను నివారించి హీరోగా పేరుపొందిన కుల్మాన్ ఘిసింగ్ వంటి ఒక టెక్నోక్రాట్‌ను ప్రధానిగా ప్రతిపాదించింది. ఇది రాజకీయ వ్యవస్థపై వారికున్న పూర్తి అవిశ్వాసానికి, మార్పు కోసం వారికున్న తపనకు నిదర్శనం. ప్రస్తుతం దేశం ఒక అనిశ్చితి తెర వెనుక ఉంది. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినా, రాజకీయ శూన్యత కొనసాగుతోంది. ఈ సంక్షోభం యువత శక్తిని నిరూపించినా, స్థిరమైన ప్రత్యామ్నాయం లేకపోతే అరాచకానికి దారితీసే ప్రమాదం ఉంది.
దార్శనిక దృష్టి: అంబేడ్కర్, బాలగోపాల్‌ల కోణంలో : ఈ సంక్షోభాల మూలాలను అర్థం చేసుకోవాలంటే, మనం అంబేడ్కర్, బాలగోపాల్‌ల సిద్ధాంతాల వెలుగులో చూడాలి.
బాలగోపాల్ రాజ్య స్వభావం: మానవ హక్కుల ఉద్యమకారుడు బాలగోపాల్ రాజ్యం స్వభావాన్ని నిర్మొహమాటంగా విశ్లేషించారు. ఆయన ప్రకారం, “The state is not a neutral umpire, but an instrument of class/group oppression.” రాజ్యం అనేది ఒక వర్గం ఆధిపత్యాన్ని కాపాడే ఒక హింసాయుత సాధనం. ఈ మూడు దేశాల్లో మనం చూసింది ఇదే. శ్రీలంకలో రాజ్యం రాజపక్స కుటుంబానికి సేవ చేసింది. బంగ్లాదేశ్‌లో అది అవామీ లీగ్ పార్టీ మనుగడ కోసం ప్రజల హక్కులను కాలరాసింది. నేపాల్‌లో అది అవినీతిపరులైన రాజకీయ వర్గాన్ని కాపాడింది. ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేయడం, విమర్శకులను దేశద్రోహులుగా చిత్రీకరించడం, క్రూరమైన చట్టాలను ప్రయోగించడం.. ఇవన్నీ రాజ్యం అణచివేత రూపాలే. ప్రజల తిరుగుబాటు, రాజ్యం ఈ వ్యవస్థీకృత హింసపై జరిగిన ప్రతిఘటన.
అంబేడ్కర్, రాజ్యాంగ నైతికత: డాక్టర్ అంబేడ్కర్ ప్రజాస్వామ్య మనుగడకు కేవలం రాజ్యాంగం ఉంటే సరిపోదని, “Constitutional Morality” (రాజ్యాంగ నైతికత) అనేది పాలకులలో, ప్రజలలో ఉండాలని హెచ్చరించారు. ఈ మూడు దేశాల పాలకులు రాజ్యాంగాలను తమకు అనుకూలంగా వాడుకున్నారు, స్వతంత్ర సంస్థలను నిర్వీర్యం చేశారు. ఇది రాజ్యాంగ నైతికత పూర్తి పతనం. అంతేకాక, అంబేడ్కర్ “Bhakti in religion may be a road to the salvation of the soul. But in politics, Bhakti or hero-worship is a sure road to degradation and to eventual dictatorship” అని గట్టిగా హెచ్చరించారు. శ్రీలంక, బంగ్లాదేశ్ ప్రజలు రాజపక్సలను, షేక్ హసీనాను రక్షకులుగా భావించి, గుడ్డిగా ఆరాధించారు. ఈ వ్యక్తి పూజే నియంతృత్వానికి, తద్వారా పతనానికి దారితీసింది. చివరగా, ఆయన చెప్పిన “Social Democracy” (సామాజిక ప్రజాస్వామ్యం) – అంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం – ఈ దేశాల్లో కొరవడింది. మైనారిటీలను అణచివేయడం, అసమానతలు పెరగడం, యువత ఆకాంక్షలను విస్మరించడం.. ఇవన్నీ సామాజిక ప్రజాస్వామ్యం లేకపోవడానికి నిదర్శనాలు.
భారతదేశ ఆత్మవిమర్శ: అద్దంలో మన ప్రతిబింబం : పొరుగు దేశాల్లోని ఈ పరిణామాలు భారతదేశానికి అద్దం పడుతున్నాయి. మనం ఆ అద్దంలోకి ధైర్యంగా చూడాలి.
ఆర్థిక క్రమశిక్షణ: శ్రీలంక సంక్షోభం మనకు ఆర్థిక క్రమశిక్షణ ప్రాముఖ్యతను గుర్తుచేస్తోంది. “Revdi Culture” (ఉచితాల సంస్కృతి), పెరుగుతున్న ద్రవ్యలోటు, విదేశీ అప్పులపై ఆధారపడటం వంటివి ప్రమాద ఘంటికలు.
ప్రజాస్వామ్య సంస్థల పరిరక్షణ: బంగ్లాదేశ్ ఉదంతం, ప్రజాస్వామ్య సంస్థల (న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం, మీడియా) స్వాతంత్ర్యం ఎంత కీలకమో చెబుతోంది. భారతదేశంలో కూడా ఈ సంస్థల స్వయంప్రతిపత్తిపై చర్చ జరుగుతున్న తరుణంలో ఇది మరింత ముఖ్యమైన పాఠం. వ్యక్తి పూజ, ఒకే నాయకుడి చుట్టూ రాజకీయాలు కేంద్రీకృతం కావడం అనే అంబేడ్కర్ హెచ్చరికను మనం విస్మరించకూడదు.
సామాజిక సామరస్యం: శ్రీలంకలో మెజారిటీ జాతీయవాదం చివరికి దేశాన్నే ముంచింది. భారతదేశంలో కూడా మతం, కులం పేరుతో పెరుగుతున్న విభజన రాజకీయాలు దేశ ఐక్యతకు, స్థిరత్వానికి గొడ్డలిపెట్టు. “An ounce of practice is worth more than tons of preaching.” మనం సౌభ్రాతృత్వాన్ని కేవలం రాజ్యాంగంలోనే కాకుండా, ఆచరణలో చూపాలి.
యువత శక్తి, నిరుద్యోగ సమస్య: నేపాల్ సంక్షోభం మనకు అతిపెద్ద హెచ్చరిక. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉన్న దేశం మనది. ఇది “Demographic Dividend” (జనాభా డివిడెండ్) మాత్రమే కాదు, సరైన అవకాశాలు కల్పించకపోతే “Demographic Disaster” (జనాభా విపత్తు)గా మారే ప్రమాదం ఉంది. పెరుగుతున్న నిరుద్యోగం, ఆకాంక్షలకు, అవకాశాలకు మధ్య పెరుగుతున్న అగాధం.. ఇవి నేపాల్‌ను కదిలించిన అవే శక్తులు.
భారత్‌కు ఈ గండం ఉందా : భారత ప్రజాస్వామ్య పునాదులు లోతైనవి. మనకున్న వైవిధ్యం, బలమైన పౌర సమాజం, సాపేక్షంగా స్వతంత్రమైన కొన్ని సంస్థలు మనకు రక్షణ కవచాలు. కానీ, పొరుగు దేశాల్లో సంక్షోభానికి దారితీసిన లక్షణాలు మనలోనూ కనిపిస్తున్నాయన్నది పచ్చినిజం. అసమ్మతిపై పెరుగుతున్న అసహనం, అణచివేత చట్టాల వినియోగం, తీవ్రమవుతున్న సామాజిక సమస్యలు, యువతలో నిరాశ.. ఇవన్నీ మనం నిర్లక్ష్యం చేయలేని ప్రమాద సంకేతాలు.
పొరుగున రగులుతున్న ఈ అగ్నిగుండం మనకు ఒకటే సందేశం ఇస్తోంది: ప్రజాస్వామ్యం అనేది ఒకసారి గెలుచుకుని, భద్రంగా దాచుకునే ఆస్తి కాదు. అది నిరంతర జాగరూకతతో, పోరాటంతో కాపాడుకోవాల్సిన ఒక సున్నితమైన మొక్క. పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజలు పాలకులను గుడ్డిగా ఆరాధించకూడదు. రాజ్యాంగం సర్వోన్నతమైనదిగా ఉండాలి, వ్యక్తి కాదు. సామాజిక న్యాయం, సమానత్వం లేకుండా ఆర్థిక అభివృద్ధి నిలవదు. ఈ సత్యాలను మనం గ్రహించకపోతే, పొరుగున రగులుతున్న చితిమంటల వేడి మన గుమ్మాలను తాకడానికి ఎంతో కాలం పట్టదు. ఇది భయపెట్టడం కాదు, చరిత్ర మన ముందు ఉంచుతున్న వాస్తవాన్ని హెచ్చరించడమే.


