Southwest monsoon to hit Kerala: వేసవి కారణంగా ఎండలు మండుతున్న వేళ.. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న దేశ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. దేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడి లాంటి నైరుతి రుతుపవనాలు మే 26న కేరళను తాకనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఆ వెంటనే తెలుగు రాష్ట్రాలను తాకనున్నాయి. సాధారణంగా ప్రతి ఏటా జూన్ 1 నాటికి నైరుతి రుతుపవనాలు పలకరిస్తుంటాయి. కానీ, ఈసారి ఐదు రోజుల ముందే కేరళను తాకే అవకాశం ఉన్నట్లు ఐఎండీ శుక్రవారం వెల్లడించడం గుడ్‌న్యూస్ అనే చెప్పవచ్చు.
Also Read: http://teluguprabha.net/business/rupee-value-nears-century-mark/
రైతులను వెంటాడుతున్న ఎల్‌నినో భయాలు..
భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతు పవనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. నైరుతి రుతు పవనాల కాలంలో విస్తారంగా వర్షాలు పడి.. పంటలు సమృద్ధిగా పండుతాయి. అయితే, వాతావరణ శాఖ ప్రకారం ఈసారి వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉన్నప్పటికీ.. ఎల్‌నినో భయాలు రైతులను వెంటాడుతున్నాయి. తూర్పు, మధ్య పసిఫిక్ మహా సముద్రం ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పుల నేపథ్యంలో ఎల్‌నినో ప్రారంభమైందని ఇప్పటికే ఇన్‌కాయిస్ ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ వరకు పరిస్థితులు తటస్థంగానే ఉండగా తాజాగా ఎల్‌నినోగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుత, మే నుంచి 2027 జనవరి వరకు ఈ పరిస్థితులు కొనసాగుతాయని అంచనా వేసింది. నైరుతి రుతుపవనాల మొదటి దశలో అంటే జూన్ నుంచి జులై ప్రారంభంలో స్థిరమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ సంస్థలు వెల్లడించాయి. అయితే. ఆగస్టు, సెస్టెంబర్ నెలల్లో ఎల్‌నినో బలపడి, దేశవ్యాప్తంగా వర్షపాతంపై తీవ్ర ప్రభావం చూపొచ్చని వాతావరణ శాఖ అంచనా వేయడంతో రైతులు పంటలు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

