Bangladesh New PM: బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా ఎన్నికైన తారిఖ్ రెహ్మాన్ ప్రమాణ స్వీకారానికి భారత్ తరఫు నుంచి లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా హాజరుకానున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ సైతం హాజరు కానున్నారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తరఫున గెలిచిన తారిఖ్ ఢాకాలో ఫిబ్రవరి 17న ప్రమాణం చేయనున్నారు. కాగా, ఈ వేడుకకు రావాలని పీఎం నరేంద్ర మోదీకి ఆహ్వానం అందగా ఆయన స్థానంలో ఓంబిర్లా హాజరు కానున్నారు.
Also Read: https://teluguprabha.net/sports-news/icc-t20-world-cup-pakistan-chose-to-bowl-ind-to-bat/
బంగ్లాదేశ్ నూతన ప్రధాని ప్రమాణ స్వీకారంక కార్యక్రమంలో స్పీకర్ ఓంబిర్లా పాల్గొనడం ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న బలమైన, చిరకాల స్నేహానికి నిదర్శనమని విదేశాంగ శాఖ పేర్కొంది. చరిత్ర, సంస్కృతి, పరస్పర గౌరవంతో ముడిపడి ఉన్న పొరుగు దేశంగా, తారిఖ్ రెహమాన్ నాయకత్వంలో ఏర్పడుతున్న ఎన్నికైన ప్రభుత్వాన్ని భారత్ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు వెల్లడించింది. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్న బంగ్లాదేశ్‌కు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేసింది.
కాగా, ఫిబ్రవరి 12న 300 స్థానాలకు గాను 299 స్థానాలకు పార్లమెంటరీ ఎన్నికల పోలింగ్ జరగ్గా.. ఫలితాల ప్రకారం, బీఎన్‌పీ 209 సీట్లను కైవసం చేసుకుంది. మరోవైపు, జమాత్-ఎ-ఇస్లామీ 68 స్థానాలు గెలుచుకుంది. కాగా, ఫలితాలు నిలిపివేసిన రెండు నియోజకవర్గాల్లోనూ బీఎన్‌పీ అభ్యర్థులే ఆధిక్యంలో ఉన్నారని ప్రముఖ బంగ్లాదేశ్ పత్రిక ‘ప్రొథోమ్ ఆలో’ కథనం వెల్లడించింది.
Also Read: https://teluguprabha.net/viral/minister-nara-lokesh-response-on-vali-kova-bun-incident/
మరోవైపు దాదాపు 35 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌కు ఒక పురుషుడు ప్రధానమంత్రి కానుండటం విశేషం. గత 18 నెలల తాత్కాలిక ప్రభుత్వ హయాంలో పెరిగిన అశాంతి, తీవ్రవాదాన్ని అధిగమించడం కొత్త ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్‌గా నిలవనుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక, మంగళవారం జాతీయ సంసద్ భవన్‌లో కొత్తగా ఎన్నికైన సభ్యులతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎ.ఎం.ఎం. నసీరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

