ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో తొక్కిసలాట జరిగింది. మౌని అమావాస్య రెండో పుణ్యస్నానోత్సవానికి దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. వెంటనే స్పందించిన పోలీసులు, ఇతర సిబ్బంది గాయపడిన భక్తులను అంబులెన్సుల్లో సమీప ఆస్పత్రులకు తరలించారు. అయితే ఈ ప్రమాదంలో 15మంది భక్తులు మృతిచెందినట్లు తెలుస్తోందిది. మృతుల సంఖ్య మరింగ పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. మరోవైపు ప్రధాని మోదీ(PM Modi) యోగి ఆధిత్యనాథ్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా యోగికి ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు. పుణ్యస్నానాల వద్ద భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.