Stored Sugar Washed Away: హరియాణాలో కుండపోత వర్షాలు (Heavy Rains in Haryana) కురుస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్థంభించింది. చాలా చోట్ల ప్రాంతాలన్నీ నీటిమయం అయ్యాయి. వర్షాలు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రజలు ఇళ్లలోనే ఉంటున్నారు. కొన్ని చోట్ల రవాణా పూర్తిగా నిలిచిపోయింది. రోడ్లు, డ్యామ్స్ పూర్తిగా కూలిపోయాయి పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్, స్టేట్ పోలీసు విభాగం సహాయ సహకారాలు అందించేందుకు రంగంలోకి దిగాయి. అయితే వరదల ప్రభావం ఎక్కువగా ఉండటంతో తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.
ఈ వరదలతో బిల్డింగ్స్, పరిశ్రమలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల భారీ ఆస్తి నష్టం జరిగింది. ప్రస్తుత అంచనా ప్రకారం హరియాణా కోలుకునేందుకు కనీసం వారం రోజుల పైనే పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే అధికార యంత్రాగం పరిస్థితిని చక్కదిద్దే పనిలో చెమటోడుస్తోంది. ఇంకా వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో లోతట్టు ప్రాంతాలను, కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలను అక్కడి నుంచి పంపిస్తున్నారు. వీరికి పునరావాసం కల్పిస్తున్నారు.
షుగర్ మిల్లులోకి నీరు: యమునానగర్‌లోని ప్రసిద్ధ సరస్వతి షుగర్ మిల్లు పూర్తిగా నీటమునిగింది. ఈ వర్షాలు ఈ షుగర్ ఫ్యాక్టరీకి భారీ నష్టాన్ని కలిగించాయి. ఆసియాలో అతిపెద్ద చక్కెర కర్మాగారాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ మిల్లు గోడౌన్‌లో నిల్వ ఉన్న పంచదార పూర్తిగా వరద నీటిలో కరిగిపోయింది. సుమారు రూ.60 కోట్ల విలువైన పంచదార వరద నీటిలో కొట్టుకుపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ఫ్యాక్టరీ చరిత్రలోనే అతిపెద్ద నష్టం అని ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఈ నష్టంపై సరస్వతి షుగర్ మిల్ జనరల్ మేనేజర్ రాజీవ్ మిశ్రా పూర్తి వివరాలను వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా మిల్లుకు ఆనుకుని ఉన్న కాల్వ పొంగిపొర్లడంతో వరద నీరు ఒక్కసారిగా మిల్లు ప్రాంగణంలోకి ప్రవేశించిందని ఆయన తెలిపారు. దీంతో మిల్లులోని గోడౌన్‌లో నిల్వ ఉంచిన సుమారు 2.20 లక్షల క్వింటాళ్ల పంచదార నీటిమయం అయ్యింది. మిల్లు స్థాపన తర్వాత జరిగిన అతిపెద్ద ప్రమాదంగా ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.50 నుంచి 60 కోట్ల వరకు నష్టం ఉండొచ్చని ఆయన ప్రాథమిక అంచనా వేశారు.
ఇదే సమయంలో ఈ ప్రమాదం కారణంగా స్థానిక మార్కెట్లలో పంచదార సరఫరాకు ఎలాంటి అంతరాయం ఏర్పడదని ఆయన చెప్పారు. వరద ప్రభావం కాస్త తగ్గడంతో పనుల పునరుద్ధరణ ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో వర్షం ఇంకా కొనసాగుతుండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఈ వరదలు ప్రకృతి విపత్తుల ముందు మానవ సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా తేలికపాటిదేనని మరోసారి హెచ్చరించింది.